T20 World Cup : గ్రూప్-1లో ప్రధానంగా పోటీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యనే. రెండు విజయాలు, ఓ ఓటమి, రద్దుతో తలో 5 పాయింట్లతో ఈ మూడు జట్లు సమానంగా ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఈ మూడు జట్లు గెలిస్తే మెరుగైన రన్‌రేట్ కలిగిన రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఆ రకంగా న్యూజిలాండ్ (2.233), ఇంగ్లాండ్ (0.547) నాకౌట్‌కు చేరొచ్చు. భారీ రన్‌రేట్ కలిగిన కివీస్ శుక్రవారం ఐర్లాండ్‌పై గెలిస్తే బెర్తు ఖాయమవుతుంది. ఓడినా అవకాశముంటుంది కానీ.. తన ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవకూడదు. శుక్రవారం జరిగే మరో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఢీకొననున్న ఆస్ట్రేలియా (-0.304) విజయం సాధించినా సెమీస్ బెర్తు గ్యారంటీ లేదు. భారీ తేడాతో విజయం సాధించి.. ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడడం తప్ప ఆతిథ్య జట్టుకు మరో మార్గం లేదు. ఒకవేళ ఆసీస్ గెలిచి.. శనివారం ఇంగ్లాండ్‌పై శ్రీలంక గెలిస్తే 7 పాయింట్లతో ఆసీస్ ముందంజ వేస్తుంది. శ్రీలంక ఓడితే.. ఇంగ్లాండ్, ఆసీస్‌లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లంకకు ముందంజ వేసేందుకు ఇంకా ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆ జట్టు గెలవాలి. దీంతో పాటు అఫ్గానిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా లేదా ఐర్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించాయి.
ముందంజలో భారత్..:గ్రూప్-2లోనూ నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరతాయి. భారత్‌కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లలో ఓ జట్టు ఓడాలి. ఒకవేళ భారత్ ఓడి.. దక్షిణాఫ్రికా, పాక్ గెలిస్తే.. దక్షిణాఫ్రికా సెమీస్ చేరుతుంది. భారత్, పాకిస్థాన్ ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. టీమ్‌ఇండియా (0.730) కంటే మెరుగైన రన్‌రేట్‌తో పాక్ (1.117) ముందంజ వేసే అవకాశం ఉంది. సెమీస్ చేరేందుకు సఫారీ జట్టుకు గెలుపు తప్పనిసరి. ఓడిపోతే పాక్ లేదా బంగ్లాకు ఆ అవకాశం దక్కుతుంది. రన్‌రేట్‌లో వెనకబడ్డ బంగ్లా సెమీస్ చేరాలంటే.. పాకిస్థాన్‌పై ఆ జట్టు గెలవాలి. దక్షిణాఫ్రికా ఓడాలి. ఈ గ్రూప్ నుంచి నెదర్లాండ్స్, జింబాబ్వే సెమీస్ రేసులో లేవు.