T20 world Cup : టీ20 మ్యాచ్ అంటేనే ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బంతి బంతికీ సమీకరణాలు మారిపోతాయి. ఇక ప్రపంచకప్ అంటే ప్రతి జట్టూ గెలుపు కోసం గట్టిగా పోరాడుతుంది. అందుకే మ్యాచ్‌లో ఒక జట్టే ఫేవరెట్ అని చెప్పలేం. ఈ ప్రపంచకప్ అందుకు సరైన నిదర్శనం. షాక్‌లకు ఏ మాత్రం కొదవలేదు. అసలు ఆరంభమే ఓ సంచలనం. తొలి రౌండ్ మొదటి మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్ శ్రీలంకను నమీబియా ఓడించింది. అక్కడి నుంచి.. సూపర్-12 దశ చివరి రోజు వరకూ అనూహ్య ఫలితాల పరంపర కొనసాగింది. రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్ తొలిసారి అర్హత రౌండ్లో ఆడడమే కాకుండా.. మొట్టమొదటిసారిగా ప్రధాన రౌండ్ చేరలేకపోయింది. జింబాబ్వే తొలిసారి సూపర్-12కు అర్హత సాధించింది.
ఆ మలుపులు..: ఇప్పటివరకూ జరిగిన టీ20 ప్రపంచకప్‌ల్లో ఇదే అత్యుత్తమ టోర్నీ అనడంలో సందేహం లేదు. సెమీస్‌లో చోటు కోసం నెలకొన్న పోటీ, రేకెత్తిన ఉత్కంఠ, చివరి బంతి విజయాలు అందుకు కారణం. ఓ వైపు పసికూన జట్లు, మరోవైపు వాన కలిసి ఈ ప్రపంచకప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. సెమీస్‌కు దూరమయ్యేలా కనిపించిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ నాకౌట్ చేరడం.. కచ్చితంగా ముందంజ వేస్తుందని భావించిన దక్షిణాఫ్రికా నిష్క్రమించడం.. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్‌లో వెనకబడి సెమీస్‌కు దూరం కావడం.. ఇలా మలుపులెన్నో!
వర్షం వల్ల కొన్ని మ్యాచ్‌లు రద్దయి అభిమానులు తీవ్ర నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ వాన వల్ల పెద్ద జట్ల అవకాశాలపై ప్రభావం పడి.. సెమీస్ రేసు ఉత్కంఠగా మారింది. వరుణుడు నాలుగు మ్యాచ్‌లను తుడిచేసి.. రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలపై ప్రభావం చూపాడు. మొదట దెబ్బ దక్షిణాఫ్రికాపై పడింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో 7 ఓవర్లకు 64 పరుగుల లక్ష్య ఛేదనలో 3 ఓవర్లకే 51/0తో నిలిచిన సఫారీ జట్టు విజయం ఖాయమైంది. కానీ వర్షం రాకతో మ్యాచ్ రద్దయింది. ఆ మ్యాచ్ కొనసాగి, దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే సెమీస్ చేరేదే.
ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంటాడే ఆ జట్టు చివరి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇక ఐర్లాండ్, వరుణుడు కలిసి కొట్టిన దెబ్బకు ఇంగ్లాండ్, జింబాబ్వే చేతిలో ఓటమితో పాక్ సూపర్-12లోనే ఇంటి ముఖం పడతాయనిపించింది. కానీ ఆ జట్ల పోరాటానికి అదృష్టం కూడా తోడవడంతో అంచనాలు తారుమారయ్యాయి. ఆసీస్‌కు స్వదేశంలో నిరాశ తప్పలేదు. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌పై గెలిచినా.. ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేసే అవకాశాన్ని చేజార్చుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది.
ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రద్దవడం ఆస్ట్రేలియాకు చేటే చేసింది. ఒకవేళ ఆ మ్యాచ్ జరిగి, ఆసీస్ గెలిచి ఉంటే ఇప్పుడు సెమీస్‌లో నిలిచేది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు మాత్రం వరుణుడు సాయమే చేశాడని చెప్పాలి. ఛేదనలో దూసుకుపోయిన బంగ్లాను వర్షం అంతరాయం తర్వాత భారత్ కట్టడి చేసి గెలిచింది. ఇక భారత్, పాక్ పోరు సహా చివరి బంతి లేదా ఆఖరి ఓవర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫలితం తేలిన ఏడు (సూపర్-12లో) మ్యాచ్‌లు టోర్నీలో వినోదాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి.