భారత్ టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయినా భారత్ సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇంకా ఉన్నాయని అంటున్నాడు మాజీ కెప్టెన్ కపిల్. "నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ మెరుగైంది. బ్యాటింగ్‌లో భారత్ మరిన్ని పరుగులు చేయాల్సింది. అయితే చివరి 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేయడం ద్వారా మెరుగైన స్కోరు సాధించారు. ఆస్ట్రేలియాలో మైదానాలు పెద్దవిగా ఉండడం స్పిన్నర్లకు కలిసొస్తోంది. కానీ భారత్‌కు ఇప్పటికీ సరైన బౌలింగ్ లేదు" అని కపిల్ పేర్కొన్నాడు.
"నెదర్లాండ్స్ లాంటి జట్లతో ఆడేటప్పుడు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో సరైన ప్రణాళిక ఉండాలి. అలాంటి మ్యాచ్‌ల్లో నోబాల్స్, వైడ్లు ఉండకూడదు. మొత్తంగా భారత బౌలింగ్ బాగానే ఉన్నా.. లోపాలు ఇంకా స్పష్టంగా కనపడుతున్నాయి" అని కపిల్ చెప్పాడు. వచ్చిన అవకాశాలను సూర్యకుమార్ యాదవ్ గొప్పగా అందిపుచ్చుకుంటున్నాడని అన్నాడు. "వేగంగా పరుగులు చేస్తున్నందుకు అతణ్ని మరింత మెచ్చుకోవాలి. రోహిత్ ఇంకా బాగా ఆడాలి. రాహుల్ ఫామ్‌ను అందుకోవాలి. కోహ్లి యాంకర్ పాత్రను పోషించాలి. అతడు 20 ఓవర్లూ ఆడితే భారత్ ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుంది" అని కపిల్ చెప్పాడు.