డాక్టర్లు కళ్లను చూసి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంటారు అని అందరికీ తెలుసు. అయితే గోళ్లను చూసి కూడా మన ఆరోగ్య సంబంధిత అంశాలను తెలుసుకోవచ్చట. గోళ్ల రంగు, రూపురేఖలలో వచ్చే మార్పులు అనారోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. అందుకే గోళ్లలో వచ్చే మార్పులు ఎక్కువగా కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే గోళ్లలో వచ్చే కొన్ని మార్పులు.. గుండె, కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలకు సూచనలకు కారణం అంటున్నారు వైద్య నిపుణులు.
గోళ్లలో వచ్చే కొన్ని మార్పులను బట్టి మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే కొన్ని సూచనలను వైద్య నిపుణులు తెలిపారు. అవేంటంటే..
- గోళ్ల రంగు పూర్తిగా లేదా పాక్షికంగా తెల్లగా ఉంటే అది ఏదైనా గాయం, రక్తహీనత, పోషకాహార లోపం అని భావించొచ్చు.
- అలా కాకుండా గోళ్లు చాలా వరకు తెల్లగా ఉండి అంచులు ముదురు రంగులో కన్పిస్తుంటే.. హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది.
- గోళ్లు పసుపు రంగులో ఉంటే అది ఇన్ఫెక్షన్గా భావించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ పెరిగిన కొద్దీ గోళ్లు మందంగా మారి విరిగిపోతుంటాయి. చాలా అరుదుగా థైరాయిడ్, మధుమేహం, సొరియాసిస్ వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.
- గోళ్లు నీలిరంగులో కనిపిస్తే మన శరీరానికి తగినంత ఆక్సిజన్ అందట్లేదని భావించవచ్చు. ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం కూడా కావచ్చు. అలాగే కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యలు ఉన్నా గోళ్లు నీలి రంగులోకి మారతాయి.
- గోళ్ల ఉపరితలం గుంటలు పడినట్లుగా కన్పిస్తే అది సొరియాసిస్ లేదా వాపుతో కూడిన కీళ్ల నొప్పులకు ప్రారంభ సంకేతం అయ్యే అవకాశం ఉంది.
- కొన్నిసార్లు నెయిల్స్ బాగా పొడిబారి పెలుసుగా మారి చిట్లుతుంటాయి. ఈ సమస్య తరుచుగా తలెత్తితే అది థైరాయిడ్ వ్యాధికి సంకేతమని అనుమానించాలి.
- గోళ్ల చుట్టూ ఉన్న చర్మం వాచిపోయి, ఎరుపెక్కి సున్నితంగా మారుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా సొరియాసిస్ వలన ఈ సమస్య వస్తుంది. దీనికి పైపూతలుగా వాడే స్టెరాయిడ్లను ఉపయోగించాలి.
- నెయిల్స్ కింద ముదురు రంగులో గీతలు కనపడుతుంటే దానిని 'మెలనోనికియా' అంటారు.
- కొంతమందిలో నెయిల్స్ రఫ్‌గా ఉండి, గుంతలు గుంతలుగా ఉంటాయి. వీటిని పిట్టింగ్ ఆఫ్ నెయిల్స్, రిడ్జింగ్ ఆఫ్ నెయిల్స్ అంటారు.
- గోర్లు పట్టుకునేటప్పుడు ఎగుడుదిగుడుగా ఉండటం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు తలెత్తితే సొరియాసిస్, అటోపిక్ డమటైటిస్ వంటి సమస్యలేమోనని టెస్ట్ చేసుకుంటే మంచింది. ఏదైనా దెబ్బతగిలి మానకుంటే అటోఇమ్యునో డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది.
- గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి వాటిలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే గోళ్లలో కొన్ని మార్పులు కన్పిస్తాయి. అనీమియా(రక్త హీనత) వంటి సమస్యలలో కూడా నెయిల్స్‌లో మార్పులు కన్పిస్తాయి.
- కొంతమందిలో వయసు పెరుగుతున్న కొద్దీ గోళ్ల మందం పెరిగిపోతుంది. అయితే కొద్దిమందిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. దీంతో వారు గోళ్లు కట్ చేస్తుంటే తెగకుండా ఉండి, బాగా పెరిగి గోరుకు ఏదైనా తగిలినప్పుడు చాలా నొప్పిగా ఉండటం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలలో డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
- కొంతమందికి గోళ్లను కొరికే అలవాటు విపరీతంగా ఉంటుంది. ఆందోళన కారణంగా ఇలా చేస్తుంటారు. ఇలాంటి వాళ్లలో నెయిల్స్ సైజు తగ్గిపోయి, అక్కడ చర్మం ఉబ్బెత్తుగా కనపడుతుంది. చికిత్సతో ఈ సమస్యను అధిగమించవచ్చు. అప్సెసివ్, కంపెల్సివ్ ఉన్న వాళ్లకు కూడా గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును మానుకోకపోతే వైద్యులను సంప్రదించటం మంచిది.
- గోళ్ల మధ్య భాగం గుంటలా మారిపోతే 'స్పూన్ నెయిల్స్' అంటారు. శరీరంలో ఐరన్ లోపించి, రక్తలేమి ఏర్పడినా లేదా లివర్‌కు సంబంధించిన సమస్య ఉన్నా నెయిల్స్ అలా కనిపించే అవకాశం ఉంది.
- అయితే గోళ్లలో కనిపించే మార్పులన్నీ శరీరంలోపల అనారోగ్యాలకు సూచనలు కావు. వేళ్లు, చేతులకు గాయాలైనా, ఇన్ఫెక్షన్లు సోకినా ఆ మార్పులు కన్పిస్తాయి.
- నెయిల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రొటీన్లు, సిలికా, ఐరన్, జింక్ వంటి పోషకాలు అవసరం.
- గోళ్లకు సంబంధించిన ఆందోళనకరమైన సమస్యలు కనిపించినప్పుడు వెంటనే చర్మ సంబంధిత డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.