తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ 3 ఆసనాలతో BP కంట్రోల్! ఈజీగా చేసేయండిలా!! - బీపీ తగ్గడానికి యోగా ముద్ర

Yoga Asanas For BP Control : కాస్త కోపంగా ప్రవర్తిస్తే చాలు.. బీపీ పెరిగిందని అంటుంటాం. ఒకింత ఒత్తిడికి లోనైనా అదే మాట వల్లె వేస్తుంటాం. అయితే మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు అధిక రక్తపోటుకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. రోజూ కొన్ని యోగాసనాలు సాధన చేస్తే బీపీ అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే?

Yoga Asanas For Bp Control
Yoga Asanas For Bp Control

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 12:04 PM IST

Yoga Asanas For BP Control : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ, పెరిగిపోతున్న బరువు.. వీటిన్నింటి వల్ల చిన్న వయసులోనే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఓవైపు మందులు, ఆహార నియమాలు పాటిస్తూనే.. మరోవైపు యోగసనాల సాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేక యోగాసనాలు వేయడం వల్ల రక్తపోటును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుందాం.

"రక్తపోటు సమస్య.. 35 ఏళ్ల వయసు దాటిన చాలా మందిలో కనిపిస్తోంది. ఈ సమస్యను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గుండె, మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి గురైనప్పుడు.. రక్తపోటు పెరిగిపోతుంది. అయితే యోగాలో కొన్ని అద్భుతమైన ఆసనాలు, ముద్రలు, ధ్యానప్రక్రియలు ఉన్నాయి. వీటిని రోజూ సాధన చేస్తే రక్తపోటును అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరంగా జీవించొచ్చు" అని యోగా గురువు ఆర్​.ఆర్​.ప్రసాద్​ తెలిపారు. మరి ఆ ప్రత్యేక యోగాసనాలు, ముద్రలు మీకోసం.

1.పర్వతాసనం

  • ముందుగా నిటారుగా కూర్చోవాలి
  • కుడి కాలు తిన్నగా పెట్టాలి.. సమానంగా ఎడుమ కాలు చాపాలి
  • ఆ తర్వాత ఎడమ కాలును ముందుగా మడవాలి
  • ఎడమ కాలుకు జతగా కుడి కాలును సమానంగా మడవాలి
  • కొన్ని సెకన్ల పాటు వజ్రాసనం వేయాలి
  • మోకాళ్లకు అడుగు దూరంలో రెండు చేతులను బోర్లించి ఉంచాలి
  • రెండు కాళ్లను తిన్నగా పెట్టి తలలోనికి ఉంచి పర్వతాసనం వేయాలి
  • పది సెకన్ల పాటు పర్వాతాసనంలోనే ఉండాలి
  • మళ్లీ మోకాళ్లను మడిచి వజ్రాసనంలోకి రావాలి
  • తర్వాత రెండు కాళ్లను చాపి రిలాక్స్​ అవ్వాలి

2. శేతుబంధాసనం

  • ముందుగా శవాసనం వేయాలి
  • రెండు కాళ్లను మడిచి చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి
  • మెల్లగా శరీరాన్ని పైకి లేపాలి
  • ఛాతిని గడ్డానికి తాకే విధంగా చేసుకోవాలి
  • నిదానంగా శరీరాన్ని కిందకు దింపాలి
  • కాళ్లను చాపి శవాసనం వేయాలి

3. బీపీ ముద్ర
రెండు చేతులను అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లు మోకాలపైన పెట్టాలి. ఈ ముద్రను వజ్రాసనం గానీ, సుఖాసనం గానీ, కుర్చీలో కూర్చుని చేయవచ్చు. ఉంగరం వేలును, మధ్యవేలును రెండు మడతల కింద మడవాలి. మిగతా మూడు వేళ్లు తిన్నగా పెట్టాలి. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. కళ్లు మూసుకుని.. నియమ నిష్పత్తులు పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాస తీసుకుంటూ వదలాలి. కొద్ది సేపు చేశాక కళ్లు తెరిచి ముద్రను రిలీజ్​ చేయాలి.

పర్వతాసనం చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్ల నుంచి తక్షణమే బయటపడొచ్చని నిపుణులు తెలిపారు. మెదడుకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతుందని చెప్పారు. శేతుబంధాసనం.. తక్షణమే ఒత్తడి తగ్గిస్తుందని పేర్కొన్నారు. రోజూ ఒక్కొక్క ఆసనం ఐదు సార్లు, బీపీ ముద్ర 15 నిమిషాల పాటు సాధన చేస్తే రక్తపోటు సమస్య తగ్గించుకోవచ్చని వెల్లడించారు.

బీపీతో బాధపడుతున్నారా? ఆ రెండు యోగాసనాలు, ధ్యాన ముద్రతో చెక్​ పెట్టేయండి!

'భారత్​లో 75శాతం మంది బీపీ రోగుల్లో ఆ సమస్య!'

మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెకు ప్రమాదమా?

ABOUT THE AUTHOR

...view details