టీబీ అంటే సాధారణంగా వచ్చే దగ్గే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏటా సుమారు 4.8 లక్షల మంది భారతీయులు దీనికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పునరుత్పత్తి వయసులో (20-45 ఏళ్ల మధ్య) ఉన్న మహిళలపై దీని ప్రభావం అధికంగా ఉందట! అలాగని భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే దీన్ని నయం చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహల్ని జయించాలంటున్నారు. నేడు ‘ప్రపంచ ట్యూబర్‌క్యులోసిస్ డే’ సందర్భంగా టీబీపై పలువురిలో ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..
గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ సమస్య కారణంగా ఒక్క 2014లోనే 4 లక్షల మందికి పైగా మహిళలు మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.. ఇక వీరిలో హెచ్‌ఐవీ ఉన్న వారే 1.4 లక్షల మందికి పైగా ఉండడం గమనార్హం. ఇదొక్కటనే కాదు.. మధుమేహం, కిడ్నీ సమస్యలు, పోషకాహార లోపం, కొన్ని రకాల క్యాన్సర్లు.. వంటి సమస్యలున్న వారిలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలివే!
క్షయ ఉన్న వారు తమ సమస్యను కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా గుర్తించచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
- రెండు మూడు వారాల పాటు నిరంతరాయంగా దగ్గడం. ఈ క్రమంలో దగ్గుతో పాటు రక్తం, శ్లేష్మం కనిపించడం.
- దగ్గినప్పుడు లేదంటే విశ్రాంతిలో ఉన్నా కూడా ఛాతీలో నొప్పి రావడం.
- రాత్రుళ్లు విపరీతంగా చెమట పట్టడం
- బాగా నీరసంగా, అలసటగా అనిపించడం
- సాయంత్రం, రాత్రి పూట జ్వరం రావడం
- ఆకలి మందగించడం
- బరువు తగ్గడం
- వెన్నెముక, కీళ్లలో నొప్పి
- మూత్రంలో రక్తం కనిపించడం.. మొదలైనవి
అపోహలు-వాస్తవాలు!
- టీబీ ఇన్ఫెక్షన్ క్రమంగా వ్యాధికి దారితీస్తుంది.
టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరూ తీవ్ర అనారోగ్యానికి గురికారు అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇందులో రెండు రకాల దశలుంటాయట! మొదటిది లాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్.. రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్న వారు ఈ ఇన్ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోగలరు. తద్వారా దీనికి ఆదిలోనే చెక్ పెట్టేయచ్చు. అదే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఈ లాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ క్రమంగా టీబీ వ్యాధికి దారితీస్తుందట! దీన్ని యాక్టివ్ టీబీ అంటారు. ఈ దశలో ఉన్న వారి నుంచి ఇతరులకు టీబీ సోకే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు సుమారు రెండు వారాల పాటు సరైన చికిత్స తీసుకుంటూ, వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే క్రమంగా కోలుకుంటారని చెబుతున్నారు.
- టీబీ వంశపారంపర్యంగా వస్తుంది.
ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కాదంటున్నారు నిపుణులు. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. యాక్టివ్ టీబీ ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చివరికి నవ్వినా, గట్టిగా పాటలు పాడినా.. ఇలా ఎప్పుడైతే వారి నోటి నుంచి తుంపర్లు గాల్లోకి ప్రవేశించినప్పుడు, వాటిని పీల్చిన వారికి ఇది సులభంగా వ్యాపించే అవకాశం ఉందట. అంతేతప్ప ఇది వంశపారంపర్యంగా వస్తుందని చెప్పలేం అంటున్నారు నిపుణులు.