2008 నుంచి ప్రతి ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్ రోజుగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్, ఐరోపా థైరాయిడ్ అసోసియేషన్, ఆ తరవాత మరిన్ని సంస్థలు చేరాయి. దీని ప్రధాన ఉద్దేశం థైరాయిడ్ సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం, ఈ రంగంలో సాధించిన అభివృద్ధిని తెలియచేయటం.
"మన శరీర బరువు, అది ఖర్చు పెట్టే శక్తి థైరాయిడ్ స్రవించే హర్మోన్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో కలిగే అసాధారణ మార్పులు, ఉదాహరణకు హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం, థైరాయిడ్ శోథ మొదలైనవి కలిగినపుడు జుట్టు రాలిపోవటం, మలబద్ధకం, శరీర బరువు పెరగటం/తగ్గటం అసాధారణ రుతుచక్రం, అలసట, నిస్సత్తువ మొదలైనవి కలుగుతాయ"ని బెంగళూరు కోరమంగళ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో పోషకాహార నిపుణులుగా పని చేస్తున్న వైద్యులు శరణ్య శ్రీనివాస శాస్త్రి చెబుతున్నారు.
శరీరంలో అన్ని రకాల చర్యలకు కారణమైన హర్మోన్లను తయారుచేసేదే ఈ గ్రంథి. సీతాకోక చిలుక ఆకారంలో గొంతులో అమరి ఉండే ఈ నిస్రోతస్క/నాళ రహిత గ్రంథి అతిగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజం అని తక్కువగా పనిచేస్తే హైపో థైరాయిడిజం అని అంటాం.
హైపర్ థైరాయిడిజం లక్షణాలు:
ఆందోళన, గుండె దడ, ఆదుర్దా, చిరాకు, చెమట ఎక్కువగా పట్టడం, బరువు తగ్గటం, బలహీనత, చర్మం మందం తగ్గటం మొదలైన లక్షణాలు కలుగుతాయి.
ఈ లక్షణాలు కల జబ్బులు
- గ్రేవ్స్ వ్యాధి – థైరాయిడ్ హర్మోన్లు అధికంగా ఉత్పత్తి కావటం, థైరాయిడ్ గ్రంథి ఉబ్బి ఉండటం
- థైరాయిడ్ కంతులు – గ్రంథి లోపలే కంతులు ఏర్పడటం
- థైరాయిడ్ శోథ – థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్
- అధిక మోతాదులో అయోడిన్