మంచి నిద్ర మన శరీర ఆరోగ్యానికి చాలా కీలకమైనది. శారీరక, మానసిక ఉత్తేజాన్ని పెంచడానికి నిద్రను మించిన సాధనం లేదు. కానీ కొన్ని సార్లు మనం సరిగా నిద్రించలేం. ఆందోళన వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ శరీరం పూర్తిగా అలసట చెందక అనిద్రకు లోను కావచ్చు. కానీ కొందరిలో ఇటువంటి నిద్రలేమి చాలా కాలం పాటు కొనసాగి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రాభంగం.. నిద్రలేమి అనే వ్యాధిగా మారిపోతుంది.
నిద్రలో ఊపిరాడక మెలకువ రావడం (స్లీప్ యాప్నియా) శ్వాసావరోధం వల్ల కలగవచ్చు, లేదా మెదడు ఊపిరి తీసుకునే కండరాలకు సరైన సమయంలో సరైన సంకేతాలు పంపకపోవడం వల్ల కూడా జరగవచ్చు. ఆ సమయంలో గాలి ఆడక నిద్రాభంగం కలుగుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటే నిద్రాసమయం తగ్గి రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, జ్ఞాపక శక్తి తగ్గడం, రక్తపోటు పెరగటం, అలసట, చికాకు, మధుమేహం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆపై వ్యక్తి మానసిక సామర్థ్యం కూడా బలహీనపడుతుంది.
పిల్లల్లో సుఖ నిద్రకు చిట్కాలు (12 సం.ల లోపు):
పిల్లల శారీరక మాససిక ఆరోగ్యానికి నిద్రే పునాది. ఒకే సమయానికి నిద్రించే అలవాటు, పరిశుభ్రత మంచి నిద్రను కలుగజేస్తాయి. అది ఆరోగ్యకరమైన నిద్ర అవుతుంది.
- ప్రతిరోజు ఒకే సమయానికి, రాత్రి 9 గం.ల లోపు, మీ పిల్లలు నిద్రలోకి జారుకునేట్టుగా జాగ్రత్త వహించండి.
- వయసుకు తగ్గ నిద్రా సమయాన్ని పిల్లలు పాటించేలా చూడాలి.
- నిద్రకు ముందు పళ్లు తోమడం, సంగీతం, కథలతో నిద్రకు ఉపక్రమించేలా చూడాలి.
- నిద్రించే గది చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగానూ ఉండాలి.
- పిల్లలు సొంతంగా వారే నిద్రకు ఉపక్రమించేలా చూడాలి.
- నిద్రించే సమయంలో గదిలో ఎక్కువ కాంతి పడకుండా, ఉదయం ఎక్కువ కాంతి ప్రసరించేలా చూడాలి.
- నిద్రకు ముందు అధిక శరీర వ్యాయామం, అధికంగా ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
- పిల్లలు నిద్రించే గదిలో ఎటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులో ఉండరాదు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, టెలివిజన్ మొదలైన ఉపకరణాలు అందుబాటులో ఉంటే నిద్రాభంగం కలుగుతుంది.
- కాఫీ, సోడా, తేనీరు, చాక్లెట్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
- నిద్రా సమయంతో పాటు భోజన వేళలు కూడా ప్రతి రోజు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి.
సునిద్రకు కొన్ని గృహ చిట్కాలు బాగా పని చేస్తాయి. పి.ఎస్.ఆర్.ఐ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధి నిపుణులుగా పని చేస్తున్న డా. సత్యా రాజన్ సాహు నిద్రాభంగాన్ని అధిగమించటానికి కొన్ని మార్గాలు సూచించారు.
శరీర బరువు:
ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమైనట్టే నిద్రలో ఊపిరాడక మెలకువ రావడానికి హేతువుగా ఉంది. ఊబకాయం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రసరించే మార్గాలు ఇరుకై నిద్రాభంగం కలుగుతుంది. అందువల్ల శరీర బరువును తగ్గించుకోవటం మంచి నిద్రకు ఒకానొక మార్గం.
ప్రతిరోజు వ్యాయామం: