తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

World Sleep Day: సరిగ్గా నిద్రపోవడం లేదా?.. అయితే కాస్త ఇబ్బందే!

ప్రస్తుత కాలంలో చాలా మంది టైంకి నిద్రపోవట్లేదు. ఏదో పనిలో పడి నిద్రపోయే సమయాన్ని తరుచుగా మార్చడం, నిద్రించే సమయాన్ని తగ్గించేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రగా బాగా పట్టేందుకు ఏం చేయాలో.. ఎలాంటి నియమాలో పాటించాలో ఓ సారి తెలుసుకుందాం.

World Sleep Day 2023 Sleep is Essential for Health
World Sleep Day 2023 Sleep is Essential for Health

By

Published : Mar 17, 2023, 9:02 AM IST

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని.. వేరే పనుల ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతుంటారు. అయితే మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపించే అంశం నిద్ర. అలసిపోయినప్పుడు నిద్ర పోవాలి అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అసలు వైద్యులు నిద్ర గురించి ఏమంటున్నారు.. దాని వెనుక ఉన్న లాభాలు ఏంటో చూద్దాం.

మనకి వచ్చే అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలకు నిద్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అవుతోందని అంటున్నారు వైద్యులు. ఒక వ్యక్తి తగినంత సమయం నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు రావు అని చెబుతున్నారు. మారుతున్న జీవన విధానం కారణంగా చాలామంది ఆలస్యంగా నిద్రపోవడం, తక్కువ సేపు నిద్రపోతున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతుండటాన్ని వైద్యులు ప్రస్తావిస్తున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులను అరికట్టడానికి.. రోగ నిరోధకశక్తి పెంచడం సహా అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను సరైన నిద్ర దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 'నిద్రలేమి కారణంగా వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం ఉంటోంది. అందుకే నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా నిద్ర పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని పారదోలడంతో పాటు అవగాహన పెంచడానికి వరల్డ్ స్లీప్ సొసైటీ ప్రతి సంవత్సరం నిద్ర దినోత్సవాన్ని జరుపుతోంది.' వైద్యులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి నెల మూడో శుక్రవారం ఘనంగా 'వరల్డ్ స్లీప్​ డే'ను జరుపుకుంటారు. నిద్ర గురించి ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకోవడం ఏంటనే ఓ సగటు వ్యక్తిగా చాలామందిలో అనుమానాలు వస్తుంటాయి. అయితే దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. నిద్ర ప్రాధాన్యతను తెలియజెప్పడానికి, ఆరోగ్యం మీద నిద్ర చూపించే ప్రభావాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రపంచవ్యాప్తంగా ఇలా వరల్డ్ స్లీప్​ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా నిద్ర దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. రకరకాల కారణాల వల్ల చాలామంది నిద్రకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం మీద నిద్ర ప్రభావాన్ని వివరించడానికి వరల్డ్ స్లీప్ సొసైటీ ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 'వరల్డ్ స్లీప్​ డే' సందర్భంగా నిద్ర ప్రాధాన్యతను వివరించడం సహా నిద్రలేమి సహా ఇతర నిద్ర సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు వరల్డ్ స్లీప్ సొసైటీ అవగాహన కల్పిస్తుంది. మార్చి 17వ తేదీన నిర్వహించే 'వరల్డ్ స్లీప్​ డే'ను.. ‘ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం’ అనే థీమ్​తో నిర్వహిస్తున్నారు. 2008 నుంచి వరల్డ్ స్లీప్​ డే కమిటీ మార్చి నెలలో మూడో శుక్రవారం రోజు నిద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యమని సైకాలజిస్టులు చెబుతున్నారు. నాణ్యమైన నిద్ర వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్చొచ్చని అంటున్నారు. నిద్ర విషయంలో పాటించాల్సిన కొన్ని సూచనలను వారు వివరించారు. అవేంటో ఓ సారి చూద్దాం.

  • ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.
  • పడకగది వాతావరణాన్ని ఆహ్లోదకరంగా ఉండేటట్లు చూసుకుంటే.. మంచి నిద్ర పడుతుంది.
  • రాత్రి వేళ ఎక్కువసేపు టీవీ, మొబైల్ చూడకుండా ఉండాలి.
  • రాత్రి పూట తక్కువ మోతాదులో.. వేగంగా డిన్నర్ చేసేయాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ధ్యానం చేయాలి.
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, జాగింగ్ వంటివి చేయాలి.

శారీరక, మానసిక ఆరోగ్యాల మీద ఇంత ప్రభావం చూపుతున్న నిద్ర పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. కాబట్టి ఇప్పటి నుంచి నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం సహా నిపుణుల సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందండి.

ABOUT THE AUTHOR

...view details