ప్రతి సంవత్సరం మార్చి నెల రెండో గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినంగా జరుపుకుంటాం. శరీరంలోని మూత్రపిండాల ప్రాముఖ్యం, అనుబంధ వ్యాధులు, వాటిని కాపాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించటమే ఈ రోజు ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి 11న "మూత్రపిండాల వ్యాధి ఉన్నప్పటికీ సంతోషంగా జీవించడం ఎలా" అనే అంశానికి ప్రాముఖ్యమిస్తున్నాం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (ఐఎస్ఎన్), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ (ఐఎఫ్కేఎఫ్) సంయుక్తంగా 2006 లో మొదటిసారిగా ప్రారంభించి ఈ అవగాహనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.
లాన్సెట్ వైద్య పత్రిక ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2017 లో ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల (సీకేడీ)తో బాధపడుతున్న రోగులు 69 కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. వారిలో 12 లక్షల మంది మరణించారు. సీకేడీ ఉన్న రోగులలో దాదాపు మూడోవంతు మంది చైనా, భారత్లో నివసించేవారే ఉండటం విస్మయానికి గురి చేసే అంశం.
ఈనాటి లక్ష్యాలు:
ప్రపంచ మూత్రపిండాల దినం ప్రధాన లక్ష్యాలను వారి అధికారిక వెబ్‌సైట్ ఈ విధంగా తెలియజేస్తోంది.
- దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి మధుమేహం, అధిక రక్తపోటు ముఖ్య కారణాలని తెలిపింది.
- సీకేడీ కోసం డయాబెటిస్, రక్తపోటు ఉన్న రోగులందరినీ క్రమపద్ధతిలో పరీక్షించాలి. వాటి నివారణా మార్గాలను తెలియజేయాలి.
- మూత్రపిండాల వ్యాధుల పరిశీలనలో వైద్యులకు వారి పాత్రను, ప్రాధాన్యాన్ని వివరించాలి.
- స్థానిక, జాతీయ ప్రభుత్వాలు, వాటి ఆరోగ్య విభాగాలు చేయాల్సిన పనులను నొక్కి చెప్పాలి. ఈ రోజున ప్రభుత్వాలు ఈ వ్యాధులు ఉన్న వారిని గుర్తించే కార్యక్రమాలను చేపట్టాలి.
- మూత్రపిండాల మార్పిడి దీనికి చక్కని పరిష్కారం కాబట్టి... అవయవ దానాన్ని ప్రోత్సహించాలి.
మూత్రపిండాలు ఏం చేస్తాయి?
శరీరంలో తయారైన విసర్జించదగిన విషపదార్ధాలను రక్తం నుంచి విడగొట్టి మూత్రం ద్వారా బయటకు పంపడమే కాకుండా, అదనంగా ఉన్న ద్రవాన్ని విసర్జించి రక్తపీడనాన్ని సవ్యంగా ఉండేటట్టు చేస్తాయి. ఎర్ర రక్త కణాలు జనించటానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి. వీటిలో తయారయ్యే ఉత్తేజకాలు (హార్మోన్స్) శరీర క్రియలను సక్రమంగా నిర్వహిస్తాయి.