వయసు పెరిగే కొద్దీ వెంటాడే సమస్య అధిక రక్తపోటు.మెదడు, గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. మానవాళికి అధిక రక్తపోటు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి అధిక రక్తపోటు అంటే ఏమిటో తెలిసినా.. ఇది కలుగజేసే ప్రమాదాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఏటా మే 17వ తేదీన అధిక రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంవత్సరం “మీ రక్త పీడనం సరిగ్గా కొలుచుకోండి, నియంత్రించండి, దీర్ఘకాలం జీవించండి” అనే నినాదంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల (2019) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్యతో జీవిస్తున్నారు. వీరిలో 60శాతం మంది తక్కువ ఆదాయమున్న దేశాల్లోనే జీవిస్తున్నారు. 2015 లెక్కల ప్రకారం ప్రతి 4 మంది పురుషుల్లో ఒకరికి, ప్రతి 5 మంది స్త్రీలలో ఒకరికి అధిక రక్తపోటు ఉంటుంది. అధిక రక్తపోటులో లక్షణాలు ఏమీ కనిపించక పోవడంతో దీనిని నిశ్శబ్దంగా ప్రాణం తీసే మహమ్మారిగా వైద్యులు గుర్తించారు. తరచూ రక్తపోటును పరీక్షించుకుంటూ ఉంటేనే దీని నుంచి మనల్ని మనం కపాడుకోగలం.
ప్రధానంగా కరోనా వేళ.. అధిక రక్తపోటు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధిక రక్తపోటు అంటే ఏమిటి?
రక్తం ప్రవహిస్తూ ధమనుల గోడలపై కలుగజేసే పీడనాన్ని రక్తచాపం లేదా రక్తపోటు అంటాం. ఈ పీడనం ఎక్కువగా ఉంటే వ్యాధిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. రక్తపీడనాన్ని కొలవటానికి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ధమనులపై రక్తం కలుగజేసే పీడనాన్ని సిస్టాలిక్ ప్రెజర్ అంటారు. ఇది 140 మి.మి. వరకు ఉండవచ్చు. ధమనుల గోడలు సంకోచించి రక్తంపై కలుగచేసే పీడనాన్ని డయాస్టోలిక్ ప్రజెర్ అంటారు. ఇది 90 మి.మి. వరకు ఉండవచ్చు. అంతకు మించితే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
హైదరాబాద్ వీఐఎన్ఎన్ అసుపత్రిలో వైద్యులుగా పనిచేసే రాజేష్ వుక్కల ఎండీ అధిక రక్తపోటును ఎలా నియంత్రిచుకోవాలో వివరించారు.
- దినచర్య:
నిద్ర లేవడం, ఆహారం తీసుకోవడం తరువాత నిద్రించటం అన్నీ ఒక సమయం ప్రకారం పాటించాలి. ఇతరత్రా కూడా ఆరోగ్యకరమైన శారీరక, మానసిక అలవాట్లు పాటించాలి.
- కాఫీవద్దు:
కాఫీ తాగటం బాగా తగ్గించండి. కాఫీలో ఉన్న కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. కాఫీ కొందరిలో వేరువేరు లక్షణాలను చూపించినా కాఫీ ఎంత మేర తీసుకోవాలనేది మనమే నిర్ణయించుకోవాలి.
- జంక్ ఫుడ్ కు దూరం: