ప్రస్తుతం అంతా కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు గానీ మనల్ని హెపటైటిస్ వైరస్‌లు చాలాకాలంగానే పట్టి పీడిస్తున్నాయి. శరీరంలో అత్యంత కీలకమైన కాలేయాన్ని చుట్టుముడుతూ ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కాలేయం పనితీరు అస్తవ్యస్తమైతే శరీర వ్యవస్థ అంతా కుంటుపడినట్టే. విషతుల్యాలను నిర్వీర్యం చేయటం.. జీర్ణక్రియకు, జీవ ప్రక్రియలకు అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయటం.. ప్రొటీన్లను సంశ్లేషించటం వంటి కీలకమైన పనులు చేసేది కాలేయమే. అంతేనా? విటమిన్లు, గ్లూకోజు, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని విడుదల చేస్తుంది. ఇది మహా మొండిది కూడా. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇంతటి మొండి అవయవాన్నీ హెపటైటిస్ వైరస్‌లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రాణాంతకంగానూ పరిణమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండగా.. 11 లక్షల మంది మృత్యువాత పడుతుండటమే దీనికి నిదర్శనం. దీన్ని నివారించుకునే, అదుపులో ఉంచుకునే మార్గాలున్నా ఎందుకీ దుస్థితి? హెపటైటిస్ మీద అవగాహన లేకపోవటమే. అందువల్ల దీని గురించి తెలుసుకొని ఉండటం అత్యవసరం.
హెపటైటిస్ అంటే?
- ఒక్కమాటలో చెప్పాలంటే కాలేయ వాపు. దీనికి మూలం హెపటైటిస్ వైరస్‌లు. వీటిల్లో ప్రధానంగా ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. వీటిల్లో అతి ప్రమాదకరమైనవి బి, సి వైరస్‌లు. ఎక్కువగా చూసేది హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్లే. హెపటైటిస్ ఎ, ఇ ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తాయి. వీటితో శరీరంలోకి ప్రవేశించి కాలేయ వాపునకు దారితీస్తాయి. హెపైటిస్ బి, సి మాదిరిగా ఇవేమీ దీర్ఘకాల కాలేయ జబ్బును కలగజేయవు. ప్రాణాంతకంగా మారటం అరుదు. మనం తరచూ చూసే కామెర్లు హెపటైటిస్ ఎ, ఇ వైరస్‌లతో వచ్చేవే. వీటితో తలెత్తే ఇన్‌ఫెక్షన్లు అంత ప్రమాదకరమైనవి కావు. చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి.
- హెపటైటిస్ ఎబారినపడ్డవారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం.. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగని అందరిలో అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. పిల్లల్లో కన్నా పెద్దవారిలో లక్షణాలు ఎక్కువ. దీని బారినపడ్డ పిల్లల్లో కేవలం 10% మందిలోనే కామెర్లు తలెత్తుతుంటాయి. అదే పెద్దవారిలో 70% కన్నా ఎక్కువ మంది వీటి బారినపడుతుంటారు. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబెట్టొచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, రక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్ ఎ ఇన్‌ఫెక్షన్ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ.
- హెపటైటిస్ ఇవైరస్‌లో జీనోటైప్ 1, 2, 3, 4 అని నాలుగు ఉప రకాలున్నాయి. జీనోటైప్ 1, 2 మనుషుల్లోనే ఉంటాయి. 3, 4 జీనోటైప్ వైరస్‌లు పందులు, అడవి పందుల వంటి పలు జంతువుల్లో ఉంటాయి. ఇవి జంతువుల్లో ఎలాంటి జబ్బును కలగజేయవు గానీ అప్పుడప్పుడు మనుషులకు వ్యాపించొచ్చు. ఇన్‌ఫెక్షన్ గలవారి మలం ద్వారా హెపటైటిస్ ఇ వైరస్ బయటకు వస్తుంది. వీరి మలంతో కలుషితమైన నీటితో ఇతరుల ఒంట్లోకి ప్రవేశిస్తుంది. దీని బారినపడ్డవారిలో మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, దురద, దద్దు, కీళ్ల నొప్పులూ తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చ బడుతుంటాయి. మలం పాలిపోయినట్టుగా, తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్ ఇ ఇన్‌ఫెక్షన్ చాలావరకు 2-6 వారాల్లో దానంతటదే తగ్గిపోతుంది. అరుదుగా కొందరిలో తీవ్రంగా పరిణమించొచ్చు.
- హెపటైటిస్ డి వైరస్ ఒంటరిగా ఉండదు. హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలావరకు ఈ రెండు ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. హెపటైటిస్ బి గలవారిలో దాదాపు 5% మంది హెపటైటిస్ డి ఇన్‌ఫెక్షన్‌తోనూ బాధపడుతున్నారని అంచనా. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి మాదిరిగానే ఇదీ ఇన్‌ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు, ఒకరు వాడిని సూదులను మరొకరకు వాడటం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి, డి ఇన్‌ఫెక్షన్లు ఒకేసారి దాడిచేయటం వల్ల కాలేయ వాపు తలెత్తుతుంది. కానీ చాలామంది దీన్నుంచి పూర్తిగా కోలుకుంటారు. దీర్ఘకాల కాలేయ వాపునకు దారితీయటం అరుదనే చెప్పుకోవచ్చు. హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్ గలవారికి దీని ముప్పు ఎక్కువ.
ప్రమాదకరం..
హెపటైటిస్ వైరస్‌లలో బి, సి చాలా ప్రమాదకరమైనవి. పైకేమీ తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించి, తిష్ఠ వేసుకుంటాయి. దీర్ఘకాలిక కాలేయ ఇన్‌ఫెక్షన్లుగా మారి వేధిస్తాయి. క్రమంగా కాలేయాన్ని దెబ్బతీస్తూ వస్తాయి. హెపటైటిస్ బి, సి సోకినా మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. ఇవి సంక్రమించినట్టయినా తెలియదు. దీంతో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మెత్తగా, మృదువుగా ఉండే కాలేయం గట్టిపడిపోయి, తాళ్లు తాళ్లుగా తయారవుతుంది. దీన్నే లివర్ సిరోసిస్ అంటారు. ఇలాంటి తీవ్ర దశలో రక్తస్రావం, కడుపు పెద్దగా ఉబ్బటం, కోమాలోకి వెళ్లటం, చివరకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలెన్నో తలెత్తే ప్రమాదముంది. కాబట్టి ముందు నుంచే హెపటైటిస్ బి, సి బారినపడకుండా కాపాడుకోవటం.. ఒకవేళ వీటి బారినపడితే తగు చికిత్స, జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
దీర్ఘకాల జబ్బుగా..