తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎయిడ్స్ కన్నా ఈ వ్యాధి మరణాలే ఎక్కువ.. టీకా తీసుకున్నారా? - హెపటైటిస్ చికిత్స

ఏటా 14 లక్షల మంది అకాల మరణం.. ఇందులో భారతీయులే రెండు లక్షల మంది.. ఎయిడ్స్, క్షయ వ్యాధుల కంటే ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నవారే అధికం.. అసలేంటీ వ్యాధి? వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. ఎందుకు వేయించుకోవడం లేదు?

world hepatitis day
world hepatitis day

By

Published : Jul 28, 2022, 7:00 AM IST

World Hepatitis Day 2022:జూలై 28 ప్రపంచ హెపటైటిస్ డే. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రతి ఏడాదీ జులై ఇరవై ఎనిమిదో తేదీన దీనిని పాటిస్తున్నారు. హెపటైటిస్ వ్యాధిని నిరోధించటం, వ్యాధి సోకిన పక్షంలో దానిని వెంటనే గుర్తించి ముదిరక ముందే చికిత్స ప్రారంభించటం, తద్వారా దీర్ఘకాలిక వ్యాధిగా మారకుండా చూడటం ఈ హెపటైటిస్ దినం లక్ష్యం.

ప్రపంచ హెపటైటిస్ దినం

ఎయిడ్స్, క్షయ వ్యాధుల వల్ల చనిపోతున్న వారికంటే హెపటైటిస్ వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఇటీవల వెలువరించిన ఓ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ వల్ల మరణిస్తున్న వారిలో 58 శాతం మంది తూర్పు- దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారే. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 లక్షల మంది అకాల మరణం పాలవుతున్నారు. వీరిలో దాదాపు రెండు లక్షల మంది భారతీయులే. తీవ్రమైన ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే డబ్ల్యూహెచ్​ఓ హెపటైటిస్ వ్యాధి పట్ల ఆందోళనతో వరల్డ్​ హెపటైటిస్​ డేను ప్రకటించింది.

అసలేంటీ వ్యాధి?
మానవ శరీర అంతర్భాగంలోని కీలకమైన అవయవాలలో కాలేయం ముఖ్యమైనది. పోషకాలను శరీర స్వీకరణకు అనుకూలంగా మార్చటం, రక్తాన్ని వడబోయటం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం ద్వారా ఇది వ్యక్తి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటుంది. కాలేయానికి సోకే వ్యాధుల్లో హెపటైటిస్ ప్రధానమైనది. హెపటైటిస్ అంటే కాలేయపు వాపు అని అర్థం. కాలేయం వాచిన తరువాత అది క్రమంగా దానిపైన స్కార్స్ ఏర్పడి చివరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.

దీర్ఘకాలం పాటు మితిమీరి మద్యం సేవించటం, ఆహారం- పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే విషపదార్థాలు, కొన్ని రకాల ఔషధాలు, అరుదుగా వంశపారంపర్య కారణాల వల్ల హెపటైటిస్ ఏర్పడుతుంది. అయితే చాలా సందర్భాలలో వైరస్​లు ఈ వ్యాధికి కారణం అవుతుంటాయి. హైపటైటిస్​లో నాలుగు రకాల ఇన్ఫెక్షన్లు - హెపటైటిస్ ఎ, బి, సి, డి. ఇ ఉంటాయి. మన దేశంలో సాధారణంగా హెపటైటిస్ -ఎ, హెపటైటిస్ -బి, హెపైటిస్ - సి, హెపటైటిస్ -ఇ వైరస్​ల వల్ల హెపటైటిస్ వ్యాధి వస్తోంది.

హెపటైటిస్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణాలు కనిపించే వరకూ పట్టే సమయాన్ని 'ఇంక్యుబేషన్ పీరియడ్' అంటున్నారు. ఈ సమయం వైరస్ రకాన్ని బట్టి మారుతుంటుంది. హెపటైటిస్ ఎ, ఇ వైరస్​ల విషయంలో ఇది 2 నుంచి 6 వారాలు ఉంటుంది. హెపటైటిస్ బి, సి వైరస్​లు 2 నుంచి 6 నెలల సమయం తీసుకుంటాయి. "తీవ్రమైన హెపటైటిస్ వ్యాధి చికిత్స కాలేయ మార్పిడి చేయగల వైద్యకేంద్రాలలో మాత్రమే చేయాలి. ఎందువల్ల అంటే కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకున్న స్థితిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయని పక్షంలో వ్యాధిగ్రస్థుల్లో దాదాపు 80 శాతం మంది అకాల మృత్యువు పాలవుతారు" అని విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ వేలినేని చెప్పారు.

డాక్టర్ పవన్ వేలినేని

అందుబాటులో టీకాలు
హెపటైటిస్ ఎ, బి వైరస్​ల నుంచి రక్షణ ఇవ్వగల వాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలు అందరికీ హెపటైటిస్-ఎ వాక్సిన్ చేయించాలి. హెపటైటిస్ వ్యాధి సోకే అవకాశం ఉన్న, దీర్ఘకాలంగా హెపటైటిస్ బి లేదా సితో బాధపడుతున్న వారికి కూడా హెపటైటిస్ -ఎ వ్యాధి నిరోధక టీకాలు వేయించటం అవసరం. అదే విధంగా హెపటైటిస్ సోకే అవకాశం ఉన్న అన్ని వయస్సుల వారూ హెపటైటిస్-బి వాక్సిన్ వేయించుకోవాలి.

టీకా ఉన్నా..!
టీకా మందుల ద్వారా హెపటైటిస్ వ్యాధిని నిరోధించేందుకు అవకాశం ఉన్నప్పటికీ మన దేశంలో చాలా మంది ఆ వాక్సిన్లు వేయించుకోవటం లేదు. నిజానికి కాలేయ కాన్సరు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా డబ్ల్యూ.హెచ్.ఓ. హెపెటైటిస్-బి టీకామందును సూచించింది. హెపటైటిస్ బి, సి రెండు కూడా శరీరంలో స్థిరపడి లివర్ సిరోసిస్ (కాలేయ కాన్సర్) ఏర్పడేట్లు చేస్తాయి. పెద్దగా రోగ లక్షణాలు ప్రదర్శించకుండా ఉండటం వల్ల వీటిని గుర్తించి చికిత్స ప్రారంభించటానికి ప్రధాన ఆటంకంగా ఉంటోంది.

"హెపటైటిస్-బికి ప్రభావవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన టాబ్లెట్ థెరపీ ద్వారా కేవలం 12 వారాల చికిత్సతోనే హెపటైటిస్-సి వ్యాధిని దాదాపు 98 శాతం వరకూ తగ్గించటం సాధ్యపడుతోంది. హెపటైటిస్​ను విజయవంతంగా నిరోధించటానికి చేయవలసిందల్లా శరీరంలోకి ప్రవేశించిన వైరస్ కాలేయాన్ని దెబ్బదీసేందుకు ముందే గుర్తించి చికిత్స ప్రారంభించగలగటం" అని డాక్టర్ పవన్ స్పష్టం చేశారు.

పెద్ద సంఖ్యలో మరణాలకు కారణం అవుతున్న హెపటైటిస్​ను నిరోధించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలు ఈ ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తూ తమతమ దేశాలలో ఈ వ్యాధి, దానిని నిరోధం- చికిత్సల గూర్చి ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నాయి. పది సంవత్సరాలకుపైగా జరుగుతున్న ఈ ప్రపంచదేశాల ప్రయత్నం ఈ ఏడాది సమష్టి కృషితో భారీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రపంచదేశాలు రానున్న "పది సంవత్సరాల కాలంలో హెపటైటిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి" అని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details