World Egg Day 2023 : ఈ ప్రపంచంలో.. మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా...? సమాధానం ఒక్కటే! గుడ్డు! చాలామంది పాలను సంపూర్ణ ఆహారం అంటుంటారు. మిగతావేమీ తీసుకోకపోయినా ఒక్క పాలును తీసుకుంటే చాలా పోషకాలు లభిస్తాయని భావిస్తుంటారు. అయితే పాలకు సరిసాటిగా నిలిచే సంపూర్ణ ఆహారం.. గుడ్డు! విటమిన్-సి, పీచు పదార్థం- ఈ రెండూ మినహా మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి గుడ్డులో. అయితే గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని భయపడుతుంటారు కొందరు. ఈ విషయంలో పోషకాహార నిపుణులు ఏమంటున్నారో వరల్డ్ ఎగ్డే (World Egg Day) సందర్భంగా తెలుసుకుందాం.
గుడ్డులో ఉండే షోషకాలు..
Health Benefits of Eating Eggs Everyday: తెల్లసొనలో ప్రొటీన్లు, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పచ్చసొనలో విటమిన్లు ఎ, డి, ఈ అధికంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి.
కోడి గుడ్డు ప్రోటీన్లు, విటమిన్లు అందించే మంచి ఆహారమైనా.. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే లావు అయిపోతామనే భావన ఎక్కువగా ఉంటుంది. అలా భ్రమపడి గుడ్డు తినకుండా ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు. పచ్చసొనలో శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని అంటున్నారు. ఇతరఆహార పదార్థాలతో పోలిస్తే పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ చాలా తక్కువగా చెబుతున్నారు.