సురక్షితమైన రక్తం ఆవశ్యకతపై అవగాహన పెంచడం, ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే విలువైన బహుమతి అందించిన రక్తదాతలకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచదేశాలన్నీ 'అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం' నిర్వహించుకుంటున్నాయి. ఏబీఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టిన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత కార్ల్ లాండ్స్టీనర్ జయంతిని రక్తదాతలకు కృతజ్ఞతా పండగగా జరుపుకొంటున్నాయి.
గణాంకాలు
- ప్రపంచవ్యాప్తంగా ఏటా 11.85 కోట్ల రక్త దానాలు జరుగుతున్నాయి. ఇందులో 40శాతం వాటా అధిక ఆదాయం ఉన్న దేశాలదే.
- అల్పాదాయ దేశాల్లో 54 శాతం రక్త మార్పిడి ఐదేళ్లలోపు చిన్నారులకే జరుగుతోంది.
- అధిక ఆదాయ దేశాల్లో 75 శాతం రక్త మార్పిడి 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నిర్వహిస్తున్నారు.
- అధిక ఆదాయ దేశాల్లో వెయ్యి మందికి 31.5 మంది రక్తదానం చేస్తున్నారు. ఎగువ ఆదాయ దేశాల్లో ఈ సంఖ్య 15.9, మధ్య ఆదాయ దేశాల్లో 6.8, అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య 5.0 గా ఉంది.
- 2013- 2018 మధ్య స్వచ్ఛందంగా రక్తం దానం చేసే వారి సంఖ్య 78 లక్షలు పెరిగింది.
- 79 దేశాలు తమ మొత్తం రక్తంలో 90 శాతానికి పైగా ఉచితంగానే సేకరిస్తున్నాయి.
- 56 దేశాలు మాత్రం మొత్తం రక్తంలో 50 శాతం వరకు పెయిడ్ డోనర్ల నుంచి సేకరిస్తున్నాయి.
- 171 దేశాల్లో 55 దేశాలు రక్తం నుంచి ప్లాస్మాను ఉత్పత్తి చేస్తుండగా.. మరో 90 దేశాలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.
సంవత్సరానికి ఒకసారి
- తగినంత రక్త నిల్వలు ఉండాలంటే వెయ్యికి 10 నుంచి 20 మంది రక్త దానం చేయాలని సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
- కనీస అవసరాల కోసం దేశంలో ఒక శాతం జనాభా రక్త దానం చేయాలి.
- రక్తం డిమాండ్‌ను తట్టుకోవాలంటే వెయ్యికి 34 మంది సంవత్సరానికి ఒకసారి రక్తం దానం చేయాలని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.