Winter Season Health Tips :తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. రానున్న రెండు నెలల పాటు చలి అందరినీ వేధించనుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకు సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో పాటు అస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక దీర్ఘకాలిక జబ్బుల బాధలు పెరుగుతాయి. చలి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినే తిండి దగ్గరి నుంచి జీవనశైలి వరకు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. చలి కాలంలో చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల, కీళ్ల సమస్యలు ఇలా అనేకం వేధిస్తుంటాయి. చలికాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చూద్దాం.
చర్మ సంరక్షణ
Skin Care In Winter Season : చలి గాలికి చర్మం పొడారి పోయి పగుళ్లు వచ్చి దురద పెడుతుంది. దీని నుంచి విముక్తి కోసం రాత్రిపూట చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లాంటివి రాసుకోవడం ఉత్తమం. చర్మాన్ని ఎక్కువగా చలికి బహిర్గతం చేయకపోవడమే మంచిది. అన్నింటికీ మించి చలికాలంలో చీటికి మాటికి బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించాలి. స్వెటర్లు, చెవులకు మఫ్లర్లు వంటి వాటిని కచ్చితంగా ధరించాలి.
ఆస్తమా రోగులు మరింత జాగ్రత్త
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అయిన ఆస్తమాతో బాధపడే వాళ్లు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలి తీవ్రత పెరిగినప్పుడు శరీరానికి వేడి తగిలేలా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఉన్నప్పుడు తగినంత వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టడం చేయాలి.
నీళ్లు తీసుకోవడం మర్చిపోవద్దు
చలికాలంలో చాలా మంది నీటిని తీసుకోవడం తగ్గించేస్తుంటారు. చలి తీవ్రత వల్ల నీటిని తీసుకుంటే ఎక్కువగా మూత్రం వస్తుందని కొందరు, దాహం వేయట్లేదని మరికొందరు నీటిని తీసుకోవడం తగ్గించేస్తుంటారు. కానీ చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరుచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటిశాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది
చలి కాలంలో సర్వసాధారణంగా వచ్చే దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం పాలలో మిరియాల పొడిని కలిపి తాగడం మంచిది. అలాగే చలికాలంలో కీళ్లు బిగుసుపోయి కదలికలు కష్టంగా మారతాయి. దీని నివారణ కోసం కీళ్లను తరుచూ కదిలిస్తూ ఉండాలి. ఏదో ఒక వ్యాయామం, అటు ఇటు తిరగడం వల్ల కీళ్లకు మంచిది. అలాగే చలికాలంలో ఆహారాన్ని వేడిగా, తాజాగా తీసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.
చలికాలంలో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండిలా