తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలంలో కరోనాతో జాగ్రత్త - cold weather preventions

అసలే కరోనా కాలం. ఆపై చలికాలం. ఇదే ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. మామూలుగానే చలికాలంలో శ్వాసకోశ జబ్బులకు కారణమయ్యే వైరస్‌లు విజృంభిస్తుంటాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌ కోవ్‌2 కూడా శ్వాసకోశ వైరసే. అందుకే మరింత జాగ్రత్త అవసరం.

winter corona effect
చలికాలం కరోనాతో జాగ్రత్త

By

Published : Nov 14, 2020, 10:31 AM IST

చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా వైరస్‌లు ఎక్కువసేపు జీవించి ఉంటాయి. పైగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఎక్కువగా గడుపుతాం. ఈ సమయంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌లు అంటుకునే అవకాశం ఎక్కువవుతుంది. చల్లటి, పొడి గాలితో రోగనిరోధకశక్తి తగ్గుముఖం పడుతుంది. మరోవైపు చలికాలంలో మంచు కురుస్తుంది. ఇలాంటి వాతావరణంలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు దూరాలకు విస్తరించకుండా అక్కడే ఎక్కువసేపు ఉండిపోతాయి.

కాలుష్యం మరోవైపు..

చలికాలంలో కాలుష్యం కూడా ఎక్కువే. చలికి శ్వాస మార్గాలు సంకోచిస్తాయి. ఫలితంగా గాలి లోపలికి వెళ్లటం తగ్గుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివన్నీ మరింత కలవరం కలిగిస్తున్నాయి. నిజానికి ఒకప్పటితో పోలిస్తే కరోనా వైరస్‌ తీవ్రత ఇప్పుడు తగ్గింది. చలికాలంలో కేసుల సంఖ్య పెరిగినా అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చు. అయినా కూడా ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. నిర్లక్ష్యం అసలే పనికిరాదు.

ఇప్పటికే ఆస్థమా, సీవోపీడీతో బాధపడుతున్నవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మధుమేహులు, ఊబకాయులు, గర్భిణులు, క్యాన్సర్‌ బాధితులు, గుండెజబ్బులు గలవారు, కిడ్నీ వైఫల్యం బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరికి కరోనా సోకే ముప్పు ఎక్కువ. తీవ్రత కూడా ఎక్కువే. అందువల్ల ఆయా జబ్బులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆస్థమా బాధితులు క్రమం తప్పకుండా ఇన్‌హేలర్లు వాడుకోవాలి. మందులు పూర్తిగా అయిపోకముందే కొని తెచ్చికోవాలి. జనం ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవటమే మంచిది. తప్పనిసరై ప్రయాణాలు చేయాల్సి వస్తే వెంట మందులు విధిగా తీసుకెళ్లాలి.

జబ్బులతో బాధపడేవారే కాదు.. 50 ఏళ్లు పైబడ్డవారంతా డాక్టర్‌ సలహా మేరకు ఫ్లూ టీకా తీసుకోవాలి. 60 ఏళ్లు పైబడినవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు ఇంటికే పరిమితం కావటం ఉత్తమం. న్యుమోనియా టీకా తీసుకోకపోతే వెంటనే తీసుకోవాలి.

--డా.కె.శుభాకర్​, ప్రొఫెసర్​ అండ్​ హెచ్​ఓడీ క్షయ, ఛాతీవ్యాధుల విభాగం,కామినేని వైద్య విజ్ఞానసంస్థ హైదరాబాద్​

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details