తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో పిండం పూర్తిస్థాయి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఇలా రూపుదిద్దుకునే క్రమంలో తనకు కావాల్సిన పోషణను శిశువు తల్లి నుంచి పొందుతుంది. తల్లి పేగు ద్వారా శిశువుకు ఆహారం అందుతుంది. అలా తల్లి తీసుకునే ఆహారం ద్వారా అందే శక్తిని పేగు ద్వారా గ్రహించే శిశువు పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత భూమి మీదకు వస్తుంది. గర్భంలో శిశువు పెరగడం అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ.
గర్భంలో మూడు నెలలు దాటిన పిండం నాలుగో నెల నుంచి శిశువుగా మారుతుంది. అయితే నాలుగో నెల నుంచే శిశువులో మూత్రపిండాలు ఏర్పాటు అవడం.. అవి పని చేయడం మొదలుపెడతాయని ప్రముఖ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ డా.సవితాదేవి తెలిపారు. మూత్రపిండాలు పూర్తిస్థాయిలో పని చేయడం వల్ల మూత్రం ఏర్పడటం అనేది శిశువుల్లో మొదలవుతుందని ఆమె చెబుతున్నారు.
"గర్భంలోని శిశువు నాలుగో నెల నుంచే మూత్రాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుంది. అయితే మూత్రవిసర్జన అనేది గర్భిణీ ఉమ్మనీరు కలిసిపోతుంది. ఇలా మూత్రం ఉమ్మనీరులో కలిసినా శిశువు, గర్భిణీకి ఎటువంటి ప్రమాదం లేదు. సాధారణంగా శిశువులో ఏర్పడే వ్యర్థ పదార్థాలు తల్లి యామలోకి వెళ్తాయి. శిశువుకు కావాల్సిన శక్తిని అందించే మాయ ద్వారానే వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి. శిశువులో నాలుగో నెల నుంచి మూత్రం తయారువుతుంది. కానీ మలం మాత్రం అలా కాదు. శిశువు పేగుల్లో తయారయ్యే మలాన్ని మెకోనిమ్ అని అంటారు. అది సాధారణంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుట్టకముందు గర్భంలోనే లేదంటే ప్రసవానికి ముందు మల విసర్జన జరగవచ్చు అని ఆమె పేర్కొన్నారు."
--డాక్టర్. సవితా దేవి, గైనకాలజిస్ట్
సాధారణంగా ప్రసవానికి ముందు.. లేదంటే పురిటి నొప్పులు మొదలయ్యాక శిశువు మల విసర్జన చేస్తుందని గైనకాలజిస్ట్ డా. సవితాదేవి వివరిస్తున్నారు. శిశువుకు ఆక్సిజన్ లేదా రక్త ప్రసరణ తగ్గిపోవడం జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ఆమె చెబుతున్నారు. అయితే ప్రసవం సమయంలో శిశువు మల విసర్జన చేస్తే అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అంటున్నారు.
'ప్రసవం సమయంలో శిశువు మల విసర్జన చేయడం వల్ల ఆ మలాన్ని శిశువే మింగుతుంది. ఇలా మింగిన మలం శిశువు ఊపిరితిత్తులకు చేరుతుంది. దీని వల్ల శిశువు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో నిమోనియా, రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్, బిడ్డకు ఊపిరి ఆడకపోవడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు శిశువు చనిపోయే అవకాశం కూడా ఉంది.' అని ప్రముఖ గైనకాలజిస్ట్ సవితా దేవి తెలిపారు.
గర్భంలోని శిశువు మలమూత్ర విసర్జన చేస్తుందా?.. చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది!