చలికాలంలో జలుబు, దగ్గు ఎక్కువ. ముఖ్యంగా అలర్జీ స్వభావం గలవారిలో ఇవి మరింత అధికం. దీనికి కారణం అలర్జీతో బాధపడేవారిలో నిరంతరం కనిష్ఠ స్థాయిలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితమై ఉండటమే. అలర్జీ అనేది రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటంతో ముడిపడిన సమస్య. దీంతో బాధపడేవారిని ఒకరకంగా కోపంతో ఉన్న వ్యక్తులుగా పోల్చుకోవచ్చు. ఇలాంటివారిని మామూలుగా పలకరించినా కోపంతోనే స్పందిస్తారు కదా. అలాగే చల్లగాలి తగిలితే ఒకస్థాయిలో ఉన్న వాపుప్రక్రియ ఇంకాస్త ఎక్కువవుతుంది. చిన్నపాటి వైరల్ ఇన్‌ఫెక్షన్ తలెత్తినా మరింత అధికమవుతుంది.
చలికాలంలో అలర్జీ ఎందుకు మరింత ఎక్కువవుతుందో తెలుసా? - Ways to reduce allergies
అలర్జీ సమస్యలు ఉన్నాయా?.. చలికాలంలో అవి మరింత తీవ్రమయ్యాయా?.. అయితే ఇవిగో కారణాలు తెలుసుకోండి.
వాపుప్రక్రియ ఒక పరిమితిని మించితే దగ్గు, ఆయాసం, ముక్కుకారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. అందువల్ల చలికాలంలో అలర్జీ కారకాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం ఎంతైనా అవసరం. అలర్జీ కారకాలు అనగానే చల్లగాలి, కాలుష్యం వంటివే గుర్తుకొస్తాయి. ఇంట్లోని దుమ్ముధూళిలో ఉండే తవిటి పురుగులూ తక్కువేమీ కాదు. చలికాలంలో ధరించే మందం దుస్తులు, స్వెటర్లు, దుప్పట్ల వంటి వాటిల్లో ఇవి మరింత ఎక్కువగా వృద్ధి చెందుతుంటాయి. అందువల్ల అలర్జీ స్వభావం గలవారు చలిగాలి, కాలుష్యం, పొగమంచుతో పాటు తవిటి పురుగుల బారినపడకుండానూ చూసుకోవాలి.