మలంలో రక్తం పడితే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. పిల్లల్లోనైతే ఇది మరింత కలవరం కలిగిస్తుంది. నిజానికిది అరుదైనదేమీ కాదు. తరచూ చూసేదే. మలంలో కొద్దిగా రక్తం కలిసినా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. మంచి విషయం ఏంటంటే- పిల్లల్లో ఇది చాలావరకు దానంతటదే కుదురుకోవటం. లక్షణాలు, ఇబ్బందుల తీరుతెన్నులను పరిశీలించటం ద్వారా కారణాన్నీ తేలికగానే గుర్తించొచ్చు. పేగుల చివరి భాగం నుంచి రక్తస్రావమైతే అది బాగా ఎర్రగా కొట్టొచ్చినట్టు (హెమటోకేజియా) కనిపిస్తుంది. అదే పైభాగంలో రక్తస్రావమైతే రంగు మారిపోయి (మలేనా) కనిపిస్తుంది. ఏదేమైనా పిల్లల్లో రక్తస్రావాన్ని తేలికగా తీసుకోవటం తగదు. రక్తస్రావం దానికదే గానీ చికిత్సతో గానీ ఆగిపోయినా కూడా వీలైనంత త్వరగా పిల్లలను తిరిగి గాడిలో పడేలా చూడటం ముఖ్యం. ఎందుకంటే వీరిలో రక్తం మోతాదు తక్కువగా ఉంటుంది.
రక్తం మోతాదులో 10% కన్నా ఎక్కువగా తగ్గితే అత్యవసర విభాగంలో చేర్చి, జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. ఇవి వయసును బట్టి మారిపోతుంటాయి కూడా. నవజాత శిశువుల్లోనైతే మలద్వారం వద్ద చీలికలు (ఫిషర్స్) ఏర్పడటం ప్రధాన కారణం. తల్లి రక్తాన్ని మింగటం, పేగుల్లో ఇన్‌ఫెక్షన్, పుట్టుకతోనే పేగులు మెలితిరగటం వంటివీ కారణం కావొచ్చు. నెల నుంచి ఏడాది వయసు పిల్లలో- చీలికలు, పేగు భాగం పక్కనున్న పేగులోకి చొచ్చుకెళ్లటం, పేగుల్లో తిత్తులు, సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బటం, పేగు పూత వంటివి సమస్యను తెచ్చిపెట్టొచు. ఇంకాస్త పెద్ద పిల్లల్లో పెద్ద పేగులో పిలకలూ ఏర్పడొచ్చు. ఇవన్నీ మల ద్వారం నుంచి రక్తం పడేలా చేయొచ్చు. కాబట్టి వీటి గురించి సవివరంగా తెలుసుకొని ఉండటం మంచిది.
తిత్తులు (మెకెల్స్ డైవర్టికులమ్)
పిండం ఏర్పడుతున్నప్పుడు బొడ్డు తాడు ద్వారా పేగుల్లోకి వెళ్లే నాళం (ఓంఫాలోమెసెంట్రిక్ డక్ట్) పుట్టిన తర్వాత మూసుకుపోతుంది. కానీ కొందరిలో మూసుకోకపోవచ్చు. ఇది రకరకాల రూపాల్లో బయటపడుతుంటుంది. వీటిల్లో ఒకటి మెకెల్స్ డైవర్టికులమ్. ఇది పేగు వెలుపలి భాగానికి తిత్తి అంటుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా పెద్దపేగు, చిన్నపేగు కలిసే చోటు నుంచి 2 అడుగుల దూరంలో తిత్తి ఏర్పడుతుంది. దీన్నుంచి ఆమ్లం విడుదల కావటం వల్ల కొందరిలో చిన్నపేగుల్లో పుండ్లు పడొచ్చు. దీంతో నొప్పి లేకుండానే మలద్వారం నుంచి పెద్ద మొత్తంలో రక్తం పడుతుంటుంది.
పేగుల్లో తిత్తి ఏర్పడినవారిలో కేవలం 2% మందిలోనే రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి గలవారికే చికిత్స అవసరం. వీరికి తిత్తి తలెత్తిన పేగు భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. తర్వాత పేగుల చివర్లను కలిపి, లోపలి మార్గం యథావిధిగా ఉండేలా చూస్తారు. ఎలాంటి లక్షణాలూ లేకపోతే తిత్తిని అలాగే వదిలేయొచ్చు.
చీలికలు (ఫిషర్స్) ప్రధానం
పెద్దవారిలోనే కాదు, పిల్లల్లోనూ మలద్వారం వద్ద చీలికలు ఏర్పడొచ్చు. తొలి రెండేళ్లలో జీర్ణకోశం కింది భాగంలో రక్తస్రావం కావటానికి ప్రధాన కారణమిదే. దీనికి కారణం మలాశయం, మలద్వారం మధ్యలో పేగు కిందికి సాగే చోట బిగువు (యానోరెక్టల్ యాంగ్యులేషన్) ఏర్పడకపోవటం. పెద్ద పేగు చివరి భాగంలో బయటి వైపు నుంచి ప్యూబోరెక్టాలిస్ అనే కండరం వలయంలా చుట్టుకొని ఉంటుంది. ఇది పేగును ముందు వైపునకు లాగుతూ మలాన్ని పట్టి ఉంచుతుంది. విసర్జన సమయంలో మలం నెట్టుకొని వస్తున్నప్పుడిది వదులవుతుంది. అప్పుడు పేగు బిగువు తగ్గి, మలం నెమ్మదిగా కిందికి వస్తుంది. అయితే శిశువుల్లో ఈ బిగువు ఏర్పడదు.
వృద్ధుల్లోనైతే కండరాలు బలహీన పడటం వల్ల బిగువు పోతుంది. దీంతో మలం బలంగా కిందికి దూసుకొస్తూ మలద్వార గోడలను తాకుతుంది. ఫలితంగా అక్కడి పైపొరలో చీలికలు ఏర్పడతాయి. విసర్జన అనంతరం ఎర్రటి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం మీద రక్తం చారికలూ కనిపిస్తాయి. ఈ సమయంలో చాలా నొప్పి కలుగుతుంది. దీంతో పిల్లలు విసర్జనకు వెళ్లటానికి వెనకాడుతుంటారు. చీలికల సమస్య రోజుల పిల్లల్లోనూ ఎక్కువగానే కనిపిస్తుంది.
ఫిషర్స్‌ను నిర్లక్ష్యం చేయటం తగదు. ఇవి మానటానికి మలం మృదువుగా వచ్చేలా చూడటం ముఖ్యం. విసర్జన సాఫీగా అయ్యేలా చేసే మందులు, చీలికలు మానటానికి తోడ్పడే పూత మందులు, నొప్పి తెలియకుండా చేసే పూత మందులు ఉపయోగపడతాయి. కాస్త పెద్ద పిల్లలైతే పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.
పేగు పూత (ఐబీడీ)
కొందరికి పేగుల్లో పూత (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) మూలంగానూ మలంలో రక్తం పడొచ్చు. పూత తలెత్తిన చోట పేగు వాచి, ఉబ్బుతుంది. ఎర్రగా అవుతుంది. ఇదో దీర్ఘకాలిక సమస్య. వచ్చి పోతూ ఉంటుంది. పేగు పూతలో అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ అని రెండు సమస్యలుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ పెద్ద పేగుకే పరిమితమవుతుంది. పేగు పైపొరల్లోనే పుండ్లు ఏర్పడతాయి. అదే క్రాన్స్ జబ్బు పేగుల్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇది పేగుల్లోని అన్ని పొరలనూ ప్రభావితం చేస్తుంది. ఇవి రెండూ మలద్వారం నుంచి రక్తం పడటంతోనే బయటపడుతుంటాయి. విపరీతమైన కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, బరువు తగ్గటం, జ్వరం, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలూ వేధిస్తుంటాయి. ఇది కంటి జబ్బులు, దద్దు, కీళ్లనొప్పులు, కీళ్ల వాపు, కాలేయ జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీయొచ్చు.
పేగు పూత ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యు స్వభావం, రోగనిరోధక వ్యవస్థ, పరిసరాల ప్రభావం వంటివి జీర్ణకోశంలో వాపు తలెత్తేలా చేయొచ్చు. దీని చికిత్సలో లక్షణాలు తగ్గటానికి, మున్ముందు ఉద్ధృతం కాకుండా చూడటానికి, వాచిన పేగులు కుదురుకోవటానికి ప్రాధాన్యమిస్తారు. మందులతో పాటు ఆహార మార్పులు ఉపయోగపడతాయి. పేగులకు రంధ్రాలు పడినా, అడ్డంకి తలెత్తినా, పెద్దఎత్తున రక్తస్రావం అవుతున్నా శస్త్రచికిత్స అవసరమవుతుంది.