తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సంతానలేమికి మగవారూ కారకులే!

బిడ్డలను కనలేకపోతే స్త్రీపై గొడ్రాలు అనే నింద వేసే ఈ సమాజంలో పురుషుల వంధ్యత్వం వల్ల కూడా పిల్లలు పుట్టకపోవచ్చనే సంగతి చాలా మందికి తెలియదు. మరి సంతానలేమికి పురుషులు ఎలా కారకులవుతారు..? లోపాలను గుర్తించే లక్షణాలేంటి? తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం పూర్తి కథనం చదివేయండి..

What is male infertility and what are its causes?
సంతానలేమికి మగవారూ కారకులే!

By

Published : Aug 16, 2020, 10:30 AM IST

స్త్రీలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. పిల్లలు పుట్టకపోవడానికి కారణం కొన్నిసార్లు పురుషుల్లోని వంధ్యత్వం కూడా కావచ్చు అంటున్నారు వైద్యులు. హైదరాబాద్​కు చెందిన డాక్టర్ రాహుల్ రెడ్డి పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలేంటో వివరించారు. వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం, అనారోగ్యకరమైన కణాలు అధికంగా ఉండడమే వంధ్యత్వానికి ప్రధాన కారణమంటున్నారు డా.రాహుల్. అసహజ జీవన శైలి, ఒత్తిడి, జన్యుపరమైనలోపాల వల్ల కూడా ఆరోగ్యకరమైన శుక్రకణాలను పురుషులు ఉత్పత్తి చేయలేరు.

పురుషుల్లో వంధ్యత్వం సమస్యను అజూస్పెర్మియా, ఓలిగోస్పెర్మియా, వెరికోసెల్ అని మూడు రకాలుగా విభజించవచ్చు అంటున్నారు రాహుల్.

అజూస్పెర్మియా (వీర్య కణలేమి)

వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండడం, లేదా బొత్తిగా లేకపోవడం వల్ల కలిగే వంధ్యత్వాన్ని అజూస్ పెర్మియా అంటారు. ఇలాంటి సందర్భాల్లో, శుక్రకణాలు స్త్రీ అండంతో కలిసి ఫలదీకరణం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫలితంగా సంతానలేమికి ప్రధాన కారణమైన అజూస్పెర్మియా తలెత్తుతుంది.

ఓలిగోస్పెర్మియా (అల్ప శుక్రత)

సాధారణంగా ఒక్క మిల్లీలీటర్ ఆరోగ్యకరమైన వీర్యంలో 15 మిలియన్ల శుక్రకణాలుంటాయి. ఈ సంఖ్య కంటే తక్కువ శుక్రకణాలుంటే దానిని ఓలిగోస్పెర్మియా అంటారు.

వెరికోసెల్ (వృషణాల వాపు)

వీర్యం ఉత్పత్తి అయ్యే వృషణాల్లో నరాలు వాచినప్పుడు వీర్యం ఆరోగ్యవంతంగా ఉండదు. వెరికోసెల్ సమస్యతో బాధపడే పురుషుల శుక్రకణాలు స్త్రీ అండంతో ఫలదీకరణం చెందే అవకాశం తక్కువ.

వీటితో పాటు, హార్మోన్ల అసమతుల్యత కూడా సంతానలేమికి కారణం కావచ్చు.

అప్రమత్తం చేసే లక్షణాలు..

పురుషుల్లో సంతానలేమి లోపం ఉన్నట్లు కొన్ని లక్షణాల ద్వారా గుర్తించొచ్చు అంటున్నారు డా. రాహుల్. అవేంటో ఓ సారి చూసేయండి...

  • అంగస్తంభన సమస్యలు, అతితక్కువ ద్రవం స్ఖలనం
  • శృంగారంలో పాల్గొనలేకపోవడం
  • వృషణాల్లో వాపు, నొప్పి కలుగటం
  • ఆయాసం
  • గతంలో పురుషాంగానికి శస్త్ర చికిత్స జరిగి ఉండడం, ఇతర శృంగార సమస్యలు కలిగి ఉన్నా సంతానలేమికి కారణం కావచ్చు
  • అధికంగా మద్యం సేవించడం, ధూమపానం
  • మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం
  • ఊబకాయం
  • కుంగుబాటు వంటి ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఆసుపత్రికి వెళ్లమని సూచిస్తుంటాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

సంతానలేమికి పురుషులూ కారణం కావచ్చని స్పష్టమైంది కాబట్టి.. పురుషులు శుక్రకణాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డా.రాహుల్.

  • ధూమపానం, మద్యపానాన్ని వదిలేయండి
  • బరువును పరీక్షించుకుంటూ.. ఆరోగ్యకరమైన బరువుండేలా చూసుకోండి
  • కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోకండి
  • వృషణాల్లో వేడిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది
  • ఎక్కువగా లోహాలు, పురుగుమందులు, టాక్సిన్లు నిండిన వాతావరణానికి దూరంగా ఉండండి
  • ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

ఇదీ చదవండి: ఫుడ్ అలెర్జీతో పోయిన అందాన్ని ఇలా తిరిగి పొందండి !

ABOUT THE AUTHOR

...view details