చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని(tea effect on heart) ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు లక్ష మందిపై ఏడేళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజలకంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు(Heart diseases) 20 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో కథనం ప్రచురితమైంది. మరోవైపు జపాన్ దేశానికి చెందిన దాదాపు 40 వేల మందిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. రోజుకు కనీసం 5 కప్పుల గ్రీన్ టీ(green tea effect on heart) తీసుకున్నవారిలో గుండెపోటుతో మరణించే అవకాశాలు దాదాపు 26 శాతం తక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.
గుండెకు టీ ఎలా మేలు చేస్తుంది?
టీ తాగడం వల్ల గుండెకు(tea effect on heart) ఏవిధంగా మంచిదో తెలుసుకునే ముందు.. అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి పగిలిపోవడం, చిల్లులు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాల్లో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఛాతి భాగంలో నొప్పితోపాటు, హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా(tea effect on heart) ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అంతేకాకుండా రక్తకణాల లోపలి పొరల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్తేజపరచేందుకు ఈ పాలిఫెనాల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం రకరకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మరోవైపు రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను కరిగించేందుకు బ్లాక్ టీ ఎంతగానో సహాయపడుతుంది.
ఇదీ చూడండి:గ్రీన్ టీతో ప్రశాంతత, చురుకుదనం