ఎడారి దేశాల ప్రాచీన ఆహార పదార్థాల్లో ఒకటైన ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ప్రధానంగా బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర ఇది పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా లభించే ఈ ఖర్జూరంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, రోజువారీ ఆహారంలో ఖర్జూరంను ఎంచుకున్నట్లయితే బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు.
ఖర్జూర తింటే ఏమవుతుంది?
ఖర్జూరంలో ఐరన్‌తో పాటు బి1, బి2, ఏ1, విటమిన్ C వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చెడు కొవ్వును అదుపులో ఉంచుతూ.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఫైబర్‌తో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక ప్రోటీన్లు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వీటితో పాటు.. గుండె జబ్బులు, వివిధ క్యాన్సర్లను నివారించే యాంటీఆక్సిడెంట్‌లు కూడా ఖర్జూరాల్లో ఉంటాయి. ఇక అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు.. ఊబకాయం, మధుమేహ నివారణకు దోహదం చేస్తాయి.