Weight loss tips: బరువు తగ్గాలి అనుకునేవారు రోజు ఓ అరగంట ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే చాలని అనుకుంటారు. కానీ అది చాలదు. మరికొన్ని మంచి అలవాట్లను తమ జీవనశైలిలో జతచేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే కొన్ని పనులు చేయాలి. అవేంటంటే..
- బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు తరచుగా బరువు చూస్కుంటూ ఉంటారు. అయితే ఉదయాన్నే బాత్రూంకు వెళ్లి వచ్చాక బరువు చూస్కోవడం మంచిది. నీరు తాగాక, ఆహారం తీసుకున్నాక బరువు చూసుకుంటే తేడాలు వస్తాయి. ప్రతీరోజు బరువు చూసుకోవడం వల్ల లక్ష్యాన్ని మరొక్కసారి గుర్తుచేసుకున్నట్లు అవుతుంది. అలాగే ఉదయం అల్పాహారానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది. దీని వల్ల ఆకలి తగ్గి ఉదయాన్ని ఎక్కువ అల్పాహారం తినకుండా నివారించే అవకాశం ఉంటుంది.
- అలాగే ఉదయాన్నే తాగే నీరు శరీరంలో జీవక్రియలు పెరిగేలా చేసి ఎక్కువ కేలరీలు కరిగేలా చేస్తుంది. ఉదయం తప్పకుండా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలి. ఉదయాన్నే చేసే వ్యాయామం మరింత కొవ్వు కరిగించేలా చేస్తుంది.
"ఉదయాన్నే మనం లేచిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గడమే కాక దానిని మెయిన్టైన్ చేసుకోవడానికి మన బాడీ తోడ్పడుతుంది. ముఖ్యంగా నిద్రలేవగానే వ్యాయామం తప్పనిసరి. అది చేసేటప్పుడు కొంత నీరు తాగి వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. పొద్దున్న లేవగానే మనం వ్యాయామం చేసేటప్పుడు మన బాడీ ఫాస్టింగ్‌లో ఉంటుంది కాబట్టీ ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. లేవగానే మంచి హై ప్రొటీన్ డైట్ తీసుకుంటే మన ఆకలి తగ్గడానికి తోడ్పుతుంది. రోజంతా మన మెటబాలిజమ్‌ని మెయిన్టైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మన శరీరం ఆకలి, దాహానికి మధ్య తేడాను గుర్తించలేదు. రెండూ ఒకటే అనుకుని ఆకలిలేకపోయినా ఆహారం తీసుకుంటాం." అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
- ఉదయాన్నే చేసే కొన్ని పనులు, నిర్ణయాలు బరువు తగ్గేందుకు మరింత ఉపయోగపడతాయి. ఒక పూట ముందే మనం తినే ఆహారాన్ని నిర్ణయించుకోవడం ఇందులో భాగం. మధ్యాహ్నం ఏం తినబోతున్నాం అని ఉదయాన్నే నిర్ణయించుకోవడం మంచిది. అందువలన మధ్యాహ్నం హడావుడిగా ఏదో ఒకటి తినడం ఉండదు. ఉదయాన్నే తప్పకుండా కొంతసేపు ఎండలో నిలబడటం మంచిది. దీనివల్ల మరింత కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినేటప్పుడు మరో ధ్యాస లేకుండా ప్రశాంతంగా తినాలి. దీని వలన తక్కువ తినే అవకాశం ఉంటుంది.
- ఉదయం పళ్లరసం తాగే వారు పెద్ద గ్లాసు బదులు చిన్న గ్లాసుతో తాగితే మంచిది. వాటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉన్నప్పటికీ.. కొన్ని రకాల పళ్లరసాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు. ఉదయాన్ని కాఫీతాగే అలవాటు ఉంటే.. పంచదార మానేసి వెన్నతీసిన పాలతో తయారు చేసుకోవడం మంచిది. లేదా గ్రీన్‌టీ తీసుకోవచ్చు.