బరువు అదుపులో ఉంచుకోవటం ఎవరికైనా మంచిదే. గుండెజబ్బులతో బాధపడే ఊబకాయులకు, అధిక బరువు గలవారికైతే ఇది మరింత ముఖ్యం. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గేలా చూసుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. ఫలితంగా రెండోసారి గుండెపోటు బారినపడకుండా కాపాడుకోవచ్చు. అయితే గుండెజబ్బు బాధితులు, బరువు తగ్గటంపై అంతగా దృష్టి పెట్టటం లేదని ఐరోపా తాజా అధ్యయనం పేర్కొంటోంది.
20 శాతం కన్నా తక్కువే..
గుండెపోటు, గుండె రక్తనాళాల పూడికల వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో కేవలం 20% కన్నా తక్కువ మందిలోనే శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) మామూలుగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. అంటే 80% కన్నా ఎక్కువ మంది అధిక బరువు, ఊబకాయం గలవారే అన్నమాట. మరో 16 నెలల తర్వాత పరిశీలించగా ఊబకాయుల్లో 86% మంది ఇంకా ఊబకాయులుగానే ఉంటుండగా.. అధిక బరువు గలవారిలో 14% మంది ఊబకాయుల జాబితాలోకి చేరిపోయారు.
సగం మంది వారే..
చిన్నవయసు మహిళల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు సగం మంది 55 ఏళ్ల లోపు మహిళలే! మరో ముఖ్యమైన విషయం- మూడింట ఒకవంతు మంది ఊబకాయులకు శారీరక శ్రమ, ఆహారం గురించి ఎలాంటి జాగ్రత్తలు తెలియకపోవటం.