ఎవరూ కలగని ఉండరు, 2020 కరోనా భయంతో మొదలవుతుందని. ఎవరూ అనుకొని ఉండరు, కరోనా భయం ఏడాదంతా కొనసాగుతుందని. గత సంవత్సరం చివర్లో చైనాలో ఆరంభమైన కరోనా అనతికాలంలోనే మహమ్మారిగా మారి, ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసింది. దాదాపు అన్ని దేశాల ప్రజలనూ ఇల్లు కదలనీయకుండా కట్టడి చేసేసింది. మనదేశంలో జనవరిలో తొలికేసు నమోదైనప్పట్నుంచీ వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటివరకు 1.02 కోట్లకు పైగా మందిని చుట్టబెట్టిన ఇది 1.47 లక్షల మందిని కబళించేసింది. ఇంత భయంకరమైన వాతావరణంలోనూ ఊరటనిచ్చేది ఒక్కటే. ఊహించినంతగా మరణాల సంఖ్య లేకపోవటం. డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవా దృక్పథం.. శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఫలితంగా కరోనా కోరలు గట్టిగానే అణచి వేయగలిగాం. వైరస్ గుట్టుమట్లను పట్టుకోవటం, ఉన్న మందులనే కొత్తగా ఉపయోగించుకోవటం దగ్గర్నుంచి.. సత్వరం టీకాలను రూపొందించు కోవటం వరకు ఎన్నెన్నో అస్త్రాలు సొంతం చేసుకున్నాం. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 2.4% కాగా.. మనదేశంలో 2% కన్నా తక్కువే కావటం విశేషం. ఇది ఒకింత సంతృప్తి కలిగించేదే అయినా కరోనా అంతమొందినప్పుడే పూర్తి మనశ్శాంతి. నిజంగా ఇది సాధ్యమేనా? అయితే ఎప్పుడు? మరో రెండు రోజుల్లో 2021లోకి కాలుడితున్న తరుణంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. దీనికి సమాధానం ఎక్కడో లేదు. మనలోనే ఉంది. ఎందుకంటే కరోనాను అంతమొందించాల్సింది మనమే. మన చేతలతోనే.
భయం తగ్గించుకున్నప్పుడు
భయాన్ని జయిస్తే కొవిడ్‌ను జయించినట్టే! చాలామందిలో భయం, ఆందోళనే విపరీత పరిణామాలకు దారితీస్తోంది. భయపడుతున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేం. ఇది జబ్బు కన్నా మరింత హాని చేస్తుంది. కాబట్టి అనవసర భయాలకు తావివ్వకుండా అవగాహన పెంచుకుంటే కరోనాను అంతం చేయటం కష్టమేమీ కాదు. సార్స్-కోవ్2 మరో పదేళ్ల వరకూ మనతోనే ఉంటుందని టీకాను రూపొందించిన శాస్త్రవేత్తలే పేర్కొంటుండొచ్చు. అంతమాత్రాన బెంబేలెత్తి పోవాల్సిన పనిలేదు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని వంట చేయటం మానేస్తామా? రోడ్డు ప్రమాదాల భయంతో ప్రయాణాలు ఆపేస్తామా? మనం కొవిడ్-19 కారక సార్స్-కోవ్2ను పూర్తిగా తుదముట్టించలేకపోవచ్చు గానీ జాగ్రత్తగా మసలుకుంటే కరోనా మహమ్మారిని మాత్రం కచ్చితంగా అంతం చేయగలం. అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశంలోనే మామూలు ఫ్లూతో ఏటా 5 లక్షల మంది మరణిస్తున్నారు. అయినా భయపడటం లేదు కదా. వాస్తవాలు తెలుసుకుంటే భయాలను పోగొట్టుకోవచ్చు. మనదేశంలో కేసుల సంఖ్య గత నెలలో రోజుకు 25 వేల కన్నా పెరగటం లేదు. ఆ మాటకొస్తే తగ్గుతూనే ఉన్నాయి. జబ్బు నుంచి కోలుకున్నవారి సంఖ్య 95% కన్నా ఎక్కువే. ఇంతగా కోలుకోవటం మరే జబ్బుల్లోనూ లేదంటే అతిశయోక్తి కాదు. మనదేశంలో ఏటా 28 లక్షల క్షయ కేసులు నమోదవుతుండగా.. 4.74 లక్షల మంది మరణిస్తున్నారు. కాలుష్యం మూలంగా ఏటా 18 లక్షల మంది, సీవోపీడీతో రోజుకు 2,300 మంది, రోడ్డు ప్రమాదాల మూలంగా గంటకు 17 మంది చనిపోతున్నారు. వీటితో పోలిస్తే కరోనా మరణాలెంత? దాదాపు 80% మందిలో అసలు లక్షణాలే కనిపించటం లేదు. 15% మందిలో తీవ్రమవుతుండగా.. 5% మందికే వెంటలేటర్ అమర్చాల్సి వస్తోంది. వీరిలో 2% మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా వైరస్ బలహీన పడుతోందనటానికి ఇదే నిదర్శనం. క్రమంగా ఇది సాధారణ జలుబు స్థాయికి చేరుకుంటోంది. కాకపోతే కొవిడ్-19లో వ్యాధి ప్రబలత (మార్బిడిటీ) తీవ్రంగా ఉండటమే ఆందోళనకరం. ఇందులోనూ మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలే ఎక్కువగా పాలు పంచుకుంటున్నాయి. కాబట్టి మొదట్లో అంటే ఏమో గానీ.. ఇప్పుడు కొవిడ్-19ను భూతంగా చూడాల్సిన పనిలేదు. దీనర్థం విచ్చలవిడిగా తిరగటమని కాదు. నిర్లక్ష్యం అసలే కూడదని. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అవగాహనతో మెలగాలి. దీని కోరల్లో చిక్కకుండా, కలిసి జీవించటం నేర్చుకోవాలి. కొవిడ్ అంతానికి ఇదే తొలి మెట్టు.
రోగనిరోధకశక్తి పెంచుకున్నప్పుడు
మన రోగనిరోధకశక్తి బలంగా ఉంటే వైరస్ ఎంత ఉద్ధృతంగా ఉన్నా ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎంతోమంది కరోనా బారినపడకపోవటానికి ఇదే పెద్ద ఉదాహరణ. రోగనిరోధకశక్తి తగ్గినవారికి ఏ వైరస్ అయినా త్వరగానే సోకుతుంది. అంటే రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకుంటే కరోనాను అంతం చేసినట్టే. ఇందుకోసం సమతులాహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం ముఖ్యం. అలాగే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం, ధ్యానం మేలు చేస్తాయి. యోగా సైతం రోగనిరోధకశక్తి పెరగటానికి తోడ్పడుతుంది. అవసరమైతే జింక్, విటమిన్ సి, విటమిన్ డి మాత్రలతోనూ నిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. రోజుకు ఒక జింక్ 50 ఎంజీ మాత్ర, రోజుకు రెండుసార్లు విటమిన్ సి 500 ఎంజీ మాత్రలు, వారానికి ఒకసారి విటమిన్ డి 6000 ఐయూ మాత్రలు తీసుకోవచ్చు. ఇవి వైరస్‌ను ఎదుర్కోవటానికి అదనపు బలాన్నిస్తాయి.
టీకాలు తీసుకున్నప్పుడు
అందరూ కొవిడ్ టీకాలు తీసుకుంటే కరోనా కథ ముగిసినట్టే. టీకాలతో గానీ సామూహికంగా గానీ కరోనాను ఎదుర్కొనే నిరోధకశక్తి సంతరించుకుంటే కరోనా అంతమైనట్టే. వైరస్ వ్యాప్తిలో ఉన్నా పెద్ద ప్రభావమేమీ ఉండదు. కొన్నిదేశాల్లో ఇప్పుటికే టీకాలు ఆరంభించేశారు. మనదేశంలోనూ జనవరిలో టీకా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ముప్పు ఎక్కుగా ఉండే ఆరోగ్యసిబ్బందికి, రోగనిరోధకశక్తి తగ్గినవారికి, 60 ఏళ్లు పైబడ్డవారికి, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులు గలవారికి ప్రాధాన్యమిచ్చినా క్రమంగా అందరికీ ఇస్తారు. ఆలోపు సామూహిక రోగనిరోధక శక్తి సంతరించుకుంటే ఇంకా మంచిదే. మనదేశంలో సుమారు 30 కోట్ల మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు అంచనా. దురదృష్టవశాత్తు ఇవి ఐదారు నెలల వరకే ఉంటున్నాయి. అందుకే టీకా రెండు మోతాదులు తీసుకోవాలని చెబుతున్నారు. మనం మార్చి 24 నాటికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వగలిగినా చాలు. ఇటు టీకా నిరోధకశక్తి, అటు సామూహిక రోగనిరోధకశక్తి.. రెండూ కలిసినట్టవుతుంది. దీంతో మనదేశంలో కరోనా అంతం సాధ్యమవుతుంది. అందుకే టీకా విషయంలో సందేహాలు పెట్టుకోవద్దు. తీసుకోవాలా? వద్దా? అనే మీమాంస తగదు. పలు దశల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి.. సురక్షితంగా పనిచేస్తున్నట్టు తేలిన తర్వాతే టీకాలకు అనుమతిస్తారనే సంగతి తెలుసుకోవాలి. ఇతరత్రా మందుల్లాగానే కొందరికి అలర్జీ తలెత్తొచ్చేమో గానీ వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ తలెత్తటం లేదు. కాబట్టి కరోనా వచ్చినా, రాకున్నా టీకా తీసుకోవటం తప్పనిసరి. టీకా తీసుకున్నా కూడా ఇతరులకు దూరంగా ఉండటం, మాస్కు ధరించటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం మానరాదు. వీటిని ఎప్పటికీ మన జీవన విధానంలో భాగంగానే పరిగణించాలి.
జబ్బులు అదుపులో ఉంచుకున్నప్పుడు