Watermelon Health Benefits : పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో 95 శాతం వరకు నీరు ఉన్న కారణంగా.. ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రక్షిస్తుంది. పుచ్చకాయను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ భారీ నుంచి తప్పించుకోవచ్చు. అదే విధంగా పుచ్చకాయ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంట్లో విటమిన్లు సైతం ఎక్కువగానే ఉన్నాయి. పుచ్చకాయతో ఆరోగ్యపరంగా కలిగే లాభాల గురించి మరింత సమచారం తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.
పుచ్చకాయ తింటే లాభాలెన్నో.. ఇంతకీ పండిందో లేదో ముందే ఎలా గుర్తించాలి? - మంచి పుచ్చకాయను ఎలా ఎంచుకోవాలి
Watermelon Health Benefits : ఎండాకాలం వచ్చిందంటే నోరూరించి.. ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ కోసం చూస్తుంటాం. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటిని నింపుకున్న ఆ పండును వేసవిలో వీలున్నప్పుడల్లా తింటుంటాం. అయితే ఈ పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? పుచ్చకాయ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు
How to Identify Best Watermelon :ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పుచ్చకాయను కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాణ్యమైన కాయను ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత నాణ్యంగా, గుజ్జు కూడా ఎక్కువగానే ఉంటుందని.. చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే అది నిజం కాదు. కాయ చిన్నగా ఉన్నా కూడా రుచిగా ఉంటుందనేది చెప్పలేం. కాయ ఏ పరిమాణంలో ఉన్నా, చేత్తో పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అప్పుడే లోపల నీరు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం. కాబట్టి పుచ్చకాయను బరువు ఆధారంగానే ఎంపిక చేసుకోవాలి.
- కొంతమంది పుచ్చకాయ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపించే సరికి.. తాజాగా ఉందని కొనేస్తూ ఉంటారు. తీరా ఇంటికెళ్లాక చూస్తే కాయ పూర్తిగా పండకపోవటం, చప్పగా ఉండటం, గుజ్జు తక్కువగా ఉండటం గమనిస్తుంటారు. వాస్తవానికి పూర్తిగా పండిన పుచ్చకాయ.. ఎప్పుడూ ముదురు రంగులోనే ఉంటుంది. కాబట్టి పైకి కనిపించటానికి తాజాగా ఉందా లేదా అన్న విషయం పక్కనపెట్టి ముదురు వర్ణంలో ఉన్న కాయను ఎంపిక చేసుకోండి.
- కొన్ని పుచ్చకాయల్లో ఒకవైపు తెలుపు రంగు లేదంటే గోధుమ రంగు మచ్చలుంటాయి. పండించేటప్పుడు పుచ్చకాయలు నేలకు ఆనుకుని ఉండటం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే అవి అంత మంచివన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గోధుమ రంగు మచ్చలున్న పుచ్చకాయల్ని అనుమానం లేకుండా కొనొచ్చు. అంతేకాదు కొన్ని పుచ్చకాయలపై సాలెగూడుల, గోధుమ రంగులో గీతలుంటాయి. తెగులు వల్ల కాయలు అలా ఉన్నాయని వాటిని కొనేందుకు ఇష్టపడరు. వాస్తవానికి ఇంతకంటే తీపి కాయ మరొకటి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తేనేటీగలు అనేకసార్లు ఆ పూల మీద వాలడం వల్ల ఆ మచ్చలు ఏర్పడతాయి.
- సాధారణంగా పుచ్చకాయలను తొడిమ తొలగించాకే అమ్ముతుంటారు. ఒక వేళ తొడిమ కూడా ఉంటే.. అది పండిందో లేదో గుర్తించడం చాలా సులభం. తొడిమ ఎండిపోయి ఉంటే కాయ బాగా పండినట్లు. అలా కాకుండా తొడిమ కాస్త పచ్చిగా ఉంటే.. ఇంకా పక్వానికి రానట్లు భావించాలి.
- పుచ్చకాయ వాసనను బట్టి.. అది పండిందో లేదో అన్ని విషయాన్ని పసిగట్టవచ్చు. పండిన పుచ్చకాయను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని.. వాసన చూస్తే తియ్యటి వాసన వస్తుంది. ఒక వేళ మరీ ఎక్కువ వాసన వస్తే మాత్రం కొనకపోవటమే మంచిది. ఎందుకంటే అది కుళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం.
- కొంతమంది పుచ్చకాయను చేతిలోకి తీసుకుని వేలితో కొట్టి పరీక్షించటం మనం చూస్తూనే ఉంటాం. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇలా కొట్టినప్పుడు వెదురు కర్ర నుంచి వచ్చిన చప్పుడు లాగా టక్ టక్ అనే శబ్దం వినిపిస్తే.. ఆ కాయ బాగా పండినట్లన్నమాట. అలా కాకుండా చప్పుడేమీ రాకుండా ఉంటే.. అది ఇంకా పండలేదని అర్థం. ఇలా పండని కాయలు లోపలి శబ్దాన్ని బయటకు రానివ్వవు.
- ఇవీ చదవండి:
- రోజూ చిలగడదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో!.. చర్మం అస్సలు ముడతపడదంట!!
- బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. డయాబెటిస్, మలబద్ధకం, అధిక బరువుకు చెక్!