తల నుంచి కాలిగోరు వరకు అందంగా ఉండాలా.. అయితే 'ఇ' ఆయిల్ వాడేయండి! - వృద్ధాప్య ఛాయలను పొగొడుతున్న విటమిన్ ఇ ఆయిల్
Vitamin e Oil Benefits : అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందాన్ని కాపాడుకోవడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటారు. తల నుంచి కాలిగోరు వరకు సంరక్షణ కోసం విటమిన్ 'ఇ' ఆయిల్‌ను వాడి మీ అందాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ ఇ ఆయిల్ ఉపయోగాలు
Vitamin e Oil Benefits : తల నుంచి కాలిగోరు వరకు ప్రతిదీ అందంలో భాగమే! ఒక్కోదానికీ ఒక్కోరకమైన సంరక్షణ కావాలి.. అదే పెద్ద తలనొప్పి కదూ! 'ఎందుకు.. ఇ విటమిన్ తెచ్చుకోండి చాలు' అంటున్నారు నిపుణులు.
- ఈ కాలంలో త్వరగా చర్మం పొడిబారుతుంది. రాత్రుళ్లు పడుకునే అరగంట ముందు కొద్దిగా విటమిన్ 'ఇ' ఆయిల్‌ను రాయండి. లేదూ రాత్రి రాసే క్రీమ్‌కి ఒక చుక్క కలిపి రాసుకున్నా సరే! ముఖానికి కావాల్సినంత తేమ అందుతుంది.
- ముఖంపై ముడతలుపడి కళావిహీనంగా కనపడుతోందా? 'ఇ' నూనెలో వృద్ధాప్య ఛాయలను దూరంగా ఉంచే గుణాలెక్కువ. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ముడతలను దూరంగా ఉంచడమే కాదు.. చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తాయి.
- గిన్నెలు శుభ్రం చేయడం, బట్టలుతకడం.. ప్రతిదీ నీటితో చేసే పనే! వీటిల్లోని రసాయనాలు గోళ్లపై ప్రభావం చూపిస్తాయి. వంట చేసేప్పుడు కొన్ని పదార్థాలు గోళ్ల రంగును మార్చేస్తాయి. రోజూ రాత్రి కొన్ని చుక్కల విటమిన్ 'ఇ' నూనెను గోళ్లపై మృదువుగా మర్దనా చేసినట్లుగా రాయండి. తేమ అంది, విరగడం లాంటి సమస్యలూ ఉండవు.
- జుట్టు పలచబడటం, గడ్డిలా మారుతోంటే 'ఇ' ప్రయత్నించేయండి. కొబ్బరి నూనెకు కొన్ని చుక్కలు ఈ నూనెను కలిపి రాసి, కొద్దిసేపు మర్దన చేయాలి. రెండు గంటలయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండుసార్లు చేస్తోంటే.. మెరిసే కురులు సొంతమవుతాయి.
- రాత్రుళ్లు పాదాలకు విటమిన్ ఇ నూనెను రాస్తే.. నల్లబడిన పాదాలు క్రమంగా ఛాయను సంతరించుకుంటాయి.