Vitamin D Tablets Side Effects In Telugu :మనం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు విటమిన్-డి చాలా అవసరం. ఎముకల పెరుగుదలకు, రోగ నిరోధక శక్తి, కండర వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు విటమిన్-డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే విటమిన్-డి లోపం ఉన్నవారు షాపుల్లో లభించే మాత్రలను అధికంగా వాడితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. విటమిన్-డి మాత్రలను ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎక్కువగా విటమిన్-డి మాత్రలు వాడితే ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.
అతిగా తీసుకుంటే అనర్థమే
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి విటమిన్-డిమాత్రలను తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వారు సూచించిన మోతాదులో మాత్రమే విటమిన్-డి మాత్రలు తీసుకోవాలి. కొంతమంది అధికంగా విటమిన్-డి మాత్రలను వాడుతుంటారు. అలా వాడటం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-డి మాత్రలు అధిక వినియోగం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
హైపర్ విటమినోసిస్
విటమిన్-డి మాత్రలను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అరుదైన సమస్య హైపర్ విటమినోసిస్. శరీరంలో విటమిన్-డి స్థాయిలు తక్కువగా ఉన్నవారికి వైద్యులు ఆ మాత్రలను వాడాలని సూచిస్తుంటారు. విటమిన్-డి లోపాన్ని అధిగమించేందుకు కొంతమంది అవగాహన రాహిత్యంతో అధికంగా ఈ మాత్రలను వాడుతుంటారు. ఫలితంగా వారికి వచ్చే ఆరోగ్య సమస్యనే హైపర్ విటమినోసిస్ అంటారు. శరీరంలో విటమిన్-డి స్థాయిలు ఎక్కువైన వారిలో కనిపించే లక్షణాలు ఇవే..
విటమిన్-డి మాత్రలు అధికంగా తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు
- ఆకలి మందగించటం
- మలబద్ధకం
- డీహైడ్రేషన్
- అలసటగా ఉండటం
- అతి మూత్ర విసర్జన
- అధిక రక్తపోటు
- కండరాల బలహీనత
- వికారంగా ఉండుటం
- దాహం
- వాంతులు