తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

దీర్ఘకాల వ్యాధులు రావు.. గుండె జబ్బులు దూరం.. 'సి' విటమిన్​తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు!

Vitamin C benefits : మ‌నిషి శ‌రీరంలో జరిగే జీవ‌క్రియ‌ల్లో విట‌మిన్లు కీల‌క పాత్ర పోషిస్తాయి. విట‌మిన్ - ఎ కంటి ఆరోగ్యానికి తోడ్ప‌డితే.. విట‌మిన్ - సి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచ‌డంలో సాయ‌ప‌డుతుంది. ఇది త‌గ్గితే అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌ప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఆహార‌ప‌దార్థాలు తీసుకుంటే సి విట‌మిన్ మెరుగుప‌డుతుందో, అలాగే దీని వ‌ల్ల క‌లిగే 5 ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం.

Vitamin C and its Importance
విటమిన్​ సీ వల్ల కలిగే ఉపయోగాలు

By

Published : Jun 8, 2023, 10:02 AM IST

Vitamin C benefits : విట‌మిన్లు మాన‌వ జీవ క్రియ‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు ఆహారం ద్వారా అందుతాయి. వివిధ విట‌మిన్లు ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాల్ని అందిస్తాయి. వీట‌న్నింటిలో విట‌మిన్ - సి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే దీనిని శ‌రీరం త‌నంత‌ట తాను త‌యారు చేసుకోలేదు కాబ‌ట్టి. ఇది క‌ణాల అభివృద్ధి, ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుదులకు, స‌హాయ‌ప‌డ‌టంతో పాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచుతుంది. మ‌రి ఇంత‌టి ప్రాముఖ్యం క‌లిగిన దీని వ‌ల్ల క‌లిగే 5 ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌ముఖ ఫిజియోథెర‌పిస్టు, ఫిజిక‌ల్ ట్రైన‌ర్ డా. ప్ర‌శాంత్ మిస్త్రీ వివ‌రించారు. అవేంటో తెలుసుకుందాం.

1. దీర్ఘ‌కాలిక వ్యాధుల్ని నివారిస్తుంది
విట‌మిన్ సి తీసుకోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలిక వ్యాధుల బారి నుంచి తప్పించుకునే అవ‌కాశ‌ముంది. ఇది ప్రొటీన్ యాంటీ యాక్సిడెంట్​గా ప‌నిచేయ‌డం వ‌ల్ల మ‌న వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరగడంలో సాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా మ‌న‌కు హాని క‌లిగించే విధ్వంస‌క ఫ్రీ రాడిక‌ల్ కెమికల్స్ నుంచి ర‌క్ష‌ణ క‌ణాల‌ను కాపాడుతుంది.

2. అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది
మ‌న దేశంలో మూడో వంతు జ‌నాభా అధిక బీపీతో బాధ‌ప‌డుతున్నారు. ఇది కొన్ని సార్లు మ‌ర‌ణానికి సైతం దారితీయ‌వ‌చ్చు. అయితే.. విట‌మిన్ సి అధిక ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంది. అది ర‌క్త నాళాల‌ను కూల్​గా ఉంచుతుంది. దీని వ‌ల్ల ర‌క్త‌పోటు స్థాయులు త‌గ్గుతాయని ఒక ప‌రిశోధ‌న‌లో తేలింది.

3. క‌రోన‌రి హృద‌య సంబంధ వ్యాధుల ముప్పు త‌గ్గిస్తుంది
ప్ర‌పంచంలో అధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు గుండె జ‌బ్బులే కార‌ణం. బీపీ, చెడు కొలెస్ట్రాల్ లాంటి వాటి వ‌ల్ల ఇవి వ‌స్తాయి. విట‌మిన్ - 'సి'కి ఈ ప్ర‌మాద కార‌కాల‌ను త‌గ్గించే సామ‌ర్థ్య‌ముంది. 2,93,172 మందిపై చేసిన 9 అధ్య‌య‌నాల ఫలితాల్లో ఈ విషయం తేలింది. అందులో రోజూ విట‌మిన్ సి తీసుకోని వారితో పోలిస్తే.. క‌నీసం 700 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి తీసుకున్న వారికి 25 శాతం మందిలో గుండె జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశం త‌గ్గింద‌ని తేలింది.

4. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పెంచుతుంది
రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ పెర‌గ‌డంలో విట‌మిన్ సి ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడే లింఫోసైట్స్, ఫాగోసైట్స్ వంటి తెల్ల‌ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల ప‌నితీరునూ మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థకు ఇది ఎంతో అవ‌స‌రం. యాంటీ ఆక్సిడెంట్​గానూ ఇది ప‌నిచేస్తుంది.

5. గాయాలు మానడంలో సాయం చేస్తుంది
విట‌మిన్ సి తీసుకోవ‌డం వ‌ల్ల.. అది గాయాన్నివేగంగా న‌యం చేయ‌డంలో తోడ్ప‌డుతుందని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. ఈ విటమిన్​ను త‌క్కువ‌గా తీసుకునే వారిలో ప్ర‌తికూల ఆరోగ్య ఫ‌లితాలు క‌నిపిస్తాయి. ఇవే కాకుండా.. మ‌నం తినే ఆహారంలో సిట్ర‌స్ పండ్లు ఉండేలా చూసుకోవ‌డం వ‌ల్ల ఆస్త‌మా లాంటి దీర్ఘ‌కాలిక వ్యాధిని నివారించుకోవచ్చు. క్యాన్స‌ర్ సెల్స్ నివార‌ణలో విట‌మిన్ సి కీల‌క పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చ‌ర్మ‌, రొమ్ము క్యాన్సర్లను నివారిస్తుంది.

విట‌మిన్ సి త‌గ్గింద‌ని ఎలా తెలుస్తుంది?
విట‌మిన్ సి త‌గ్గింద‌ని ఎలా తెలుస్తుదంటే.. మొద‌ట‌గా ఇమ్యూనిటీ త‌గ్గిపోతుంది. దీని వ‌ల్ల జ‌లుబు, తుమ్ములు లాంటివి త్వ‌ర‌గా త‌గ్గ‌క‌పోవ‌డంతో పాటు.. వారం, రెండు వారాల త‌ర్వాత మ‌ళ్లీ తిర‌గ‌బెడ‌తాయి. రెండోదిగా చ‌ర్మంలో తేడాలు వ‌స్తాయి. చేతులు, నుదుటి మీద న‌ల్ల‌టి ముడ‌త‌లు ఏర్ప‌డ‌తాయి. మూడోదిగా జుట్టు రంగులోనూ మార్పులు వ‌స్తాయి. అది బ్రౌన్ క‌ల‌ర్ త‌ర్వాత రెడ్ క‌ల‌ర్​లోకి మారుతుంది. నాలుగోదిగా గోర్లు కూడా ప‌లుచ‌బ‌డి విరిగిపోవ‌డం, రంగు మార‌టం వంటివి జ‌రుగుతాయి. ఈ విట‌మిన్ లోపం వ‌ల్ల అల‌స‌ట నీర‌సం, దంత‌క్ష‌యం, కీళ్ల నొప్పులు లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నిమ్మ‌జాతి పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండ్ల‌లో తక్కువ క్యాల‌రీలు, జీరో కొలెస్ట్రాల్ ఉంటాయి. నిమ్మ‌కాయ‌, ఆరెంజ్, పైనాపిల్‌, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్స్, బ్ర‌కోలి, పాల‌కూర వంటి వాటిల్లో ఇది అధికంగా ల‌భిస్తుంది.

విటమిన్ C తో మెరుగైన ఆరోగ్యం మీ సొంతం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details