Vegetarian Tips Protein : మన ఆరోగ్యాన్ని కాపాడే అంశాల్లో మొదటిది ఆహారం. సరైన ఆహారం తీసుకునే అలవాటు ఉంటే అనేక అనార్యోగాలను నివారించే శక్తిని పెంచుకున్నట్లే. శాకాహారంతో అనేక అనారోగ్యాలను నివారించే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా శాకాహారమే తీసుకునేవారు పోషకాహార లోపం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి శాకాహారాలు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Vegetarians Precautions in Telugu :శాకాహారం అనేది ఎంతో ఆరోగ్యకరమైనదని చెబుతుంటారు. అయితే మాంసాహారం స్థాయిలో వీటిలో ప్రోటీన్లు ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. శాకాహారులు గింజలు, చిక్కుళ్లు, విత్తనాలు, పప్పులు, ధాన్యాలు లాంటి భిన్నమైన ఆహారాలనే తీసుకున్నట్లయితే ప్రోటీన్లతో పాటు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. మాంసాహారానికి బదులుగా తాము ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పోషకాలు లభిస్తాయో శాకాహారులకు తెలిసి ఉండాలి.
Vegetarian Protein Sources for Muscle Building : చిక్కుళ్లు, కూరగాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, పాలకూరలు వంటి భిన్నమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు తినేవారు ప్రోటీన్ కోసం వాటిని తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పులు, పళ్లు, కాయగూరలు వంటి ఆహారాల ద్వారా శాకాహారులు తమకు అవసరమైన క్యాలరీలను, పోషకాలను పొందొచ్చు. శాకాహారుల్లో కొందరు పాలు, గుడ్లను తింటారు. వీటిని తీసుకునేవారికి దాదాపు మాంసాహారులతో సమానంగా పోషకాలు లభించే అవకాశం ఉంటుంది. శాకాహారులు తాము తీసుకునే ఆహారంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి.
'శాకాహారుల్లో ల్యాక్టో వెజిటేరియన్, ఓవో వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, వీగన్స్.. ఇలా పలు రకాల వారు ఉన్నారు. ల్యాక్టో వెజిటేరియన్స్ పాల ఉత్పత్తుల్లో తమకు నచ్చినవి తీసుకుంటారు. ఓవో వెజిటేరియన్స్ గుడ్లు తింటారు. వీగన్స్ మాత్రం కేవలం మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే కూరగాయలు, ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. వీళ్లు పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు. శాకాహారులు తమ డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, పోషకాలు శరీరానికి అందేలా చూడాలి' అని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రావ్య చెప్పుకొచ్చారు.
వాటికి దూరంగా ఉండండి
Vegetarian Diet Avoid : ల్యాక్టో వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులు, పన్నీర్ లాంటివి తీసుకుంటే ఎక్కువ మోతాదులో కాల్షియం, ప్రొటీన్స్ లభిస్తాయని డాక్టర్ శ్రావ్య అన్నారు. గుడ్లు ఎక్కువగా తీసుకుంటూ, పాల ఉత్పత్తులను దూరం పెట్టే ఓవో వెజిటేరియన్స్ మాత్రం అన్ని రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే పండ్లను తరచూ తింటూ ఉండాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్ శ్రావ్య పేర్కొన్నారు.
శాకాహారంతో బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో కొలెస్ట్రాల్ స్థాయులు తక్కువగా ఉన్నాయని, వీరికి మధుమేహం, రక్తపోటు వచ్చే ఛాన్స్ కూడా తక్కువేనని అధ్యయనాల ద్వారా తేలింది. శాకాహారులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.