కాలాలను బట్టి స్నానం చేసే విధానాలు మారుతుంటాయి. ఎండాకాలంలో చాలా మంది చన్నీళ్లతో స్నానం చేస్తుంటారు. అదే వర్షాకాలం, చలికాలంలోనైతే గోరు వెచ్చటి లేదా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. కొందరు రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే.. మరికొందరు మాత్రం ఒక్కసారి చేయడానికి కూడా ఇష్టపడరు. దీనికి బద్దకం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ నిపుణులు మాత్రం రోజూ స్నానం చేయాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా వేడినీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రోజు మొత్తం పనిభారంతో అలసిపోయిన శరీరానికి, మనసుకు ఉపశమనంతో పాటు సాంత్వన చేకూరుతుంది. భారత్ లాంటి తేమ, ఉక్కపోత ఎక్కువగా ఉండే దేశాల్లో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కండరాలు ఉత్తేజితమై యాక్టివ్గా ఫీలవుతారు. దీంతో పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తుంది.
వేన్నీళ్లతో స్నానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఒత్తిళ్లు దూరం!
వేన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో చేతుల నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ సులువుగా అయ్యేలా చేస్తుంది. దీని వల్ల శరీరానికి ఉపశమనం దక్కుతుంది. అలాగే రక్తపోటు స్థాయులు తక్కువై మీరు మరింత మెరుగ్గా అనుభూతి చెందుతారు. వేడి నీళ్ల వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దీని వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు వేడినీళ్లలో తులసి లేదా నీలగిరి తైలాలను కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలేమికి చెక్!
నిద్రలేమితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు రాత్రి పడుకోవడానికి 90 నిమిషాల ముందు వేడినీళ్లతో స్నానం చేయాలి. దీని వల్ల శరీరం చల్లగా మారి.. చర్మాన్ని వెచ్చగా ఉంచుతుంది. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఒత్తిళ్లు దూరమవతాయి. మెదడులో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అయితే ఈ నీళ్ల ఉష్ణోగ్రత 104 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉండేలా చూసుకోవాలి.