'ముఖం చూడు ఎంత నల్లగా తయారైందో.. కాస్త పసుపు రాసుకోకూడదటే..' 'ఇదుగో ఈ మెంతుల పేస్ట్ తలకు రాసుకో.. జుట్టురాలడం ఆగిపోతుంది..' 'ఒంటికి నలుగుపిండి పెట్టుకున్నావంటే చాలు.. చర్మం సుకుమారంగా తయారవుతుంది..' 'ఆ షాంపూ వాడతావెందుకే.. జుట్టు రాలిపోతుంది.. చక్కగా కుంకుడు కాయలతో తలంటుకోవచ్చుగా..' అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలు వినే ఉంటారు. బామ్మల నాటి చిట్కాల వల్ల మన సౌందర్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అందుకే ఆ చిట్కాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..
పసుపు..
సాధారణంగా అమ్మాయిలకు ఎక్కువగా ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోమని చెబుతూ ఉంటారు మన అమ్మమ్మలు, బామ్మలు. అయితే దాన్ని మనం నవ్వుతూ కొట్టిపారేస్తాం.. 'ఈ కాలంలోనూ పసుపు రాసుకోవడమేంటి బామ్మా..!' అంటుంటాం. కానీ పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమల సమస్య రాకుండా కాపాడతాయి. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలు, గీతలను కూడా తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా.. మేనిఛాయ సైతం మెరుగు పడుతుంది.
బంగాళాదుంప..
నిద్ర తక్కువైనా.. కళ్లు ఒత్తిడికి గురైనా.. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. కళ్లు ఉబ్బినట్లుగా కూడా కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మన అమ్మమ్మలు 'బంగాళాదుంపని చక్రాల్లా సన్నగా కోసి.. వాటిని కళ్లపై పెట్టుకో అమ్మాయ్' అని చెబుతూ ఉంటారు. ఐదు నుంచి పదినిమిషాలు ఇలా ఉంచడం ద్వారా కళ్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అంతేకాకుండా.. బంగాళాదుంపతో తయారుచేసుకున్న ఫేస్‌ఫ్యాక్స్ వేసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని సైతం కాపాడుకోవచ్చు. దీనిలో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. బంగాళాదుంపలోని పోషకాలు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. పైగా మచ్చలను సైతం తొలగిస్తాయి.
మెంతులు..
జుట్టు రాలడం లేదా చుండ్రు సమస్య ఉన్నప్పుడు మెంతులతో హెయిర్‌ప్యాక్ వేసుకోమని చెబుతూ ఉంటారు మన బామ్మలు. గుప్పెడు మెంతులని రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి.. మరుసటి రోజు మెత్తగా రుబ్బి తలకు ప్యాక్‌లా వేసుకోవడం ద్వారా కుదుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. బామ్మల కాలంలో ఎక్కువగా పాటించిన సౌందర్య చిట్కాల్లో ఇది కూడా ఒకటి. అందుకే ఇప్పటికీ చాలామంది బామ్మల వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా ఉంటాయి. మెంతుల్లోని పొటాషియం చిన్నవయసులో వచ్చే తెల్లజుట్టు సమస్యను రాకుండా చేస్తుంది. ఇందులోని లెసిథిన్ జుట్టు దృఢంగా అయ్యేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతుల్లోని నికోటిన్ యాసిడ్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు.. దీనిలోని ఔషధ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి.