చాలా మంది కూరాగాయలు చెక్కు తీసిన తర్వాత ముక్కలు కోసి కూర వండుకోవడం పరిపాటి.. ఆ తర్వాత తొక్కలతో ఏం అవసరం అని చాలా వరకు చెత్త కుప్పలో వేస్తుంటారు. అవగాహన ఉన్నవారైతే ఎరువుల ఉపయోగానికి వాడతారు. వాటి పోషక విలువులు తెలిసిన వారు మాత్రం వంటల్లో ఉపయోగిస్తారు.మరి ఈ తొక్కలను సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తారని మీకు తెలుసా.. తెలియకపోతే ఇది చదవండి
- సొర, బీర, దోస కాయల చెక్కులను వేయించి ఉప్పు, పచ్చిమిర్చి, చింత పండుగుజ్జు, పల్లీలు లేదా నువ్వుల పొడి వేసి పచ్చడి చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కూరగాయల తొక్కులకు తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం, కొన్ని మిరియాలు జోడించి గ్రైండ్ చేసి చిన్న ఉండల్లా చేసి ఎండబెట్టి నిలవచేసుకుంటే.. ఆనక వాటితో కూర చేసుకోవచ్చు లేదా సాంబారులో వేసుకోవచ్చు.
- కూరగాయల చెక్కును కుక్కర్‌లో ఉడికించి సూప్ చేసుకోవచ్చు. రుబ్బి, బియ్యప్పిండిలో కలిపి వడియాలు పెట్టొచ్చు.
- పుచ్చకాయలో ఎర్రటి భాగాన్ని మాత్రమే తిని తక్కిందంతా పడేస్తుంటాం. దానితో రోటి పచ్చడి లేదా జామ్, స్మూతీస్ చేసుకోవచ్చు.
- మామిడిపండు మనమంతా చెక్కు తీసి ముక్కలు కోసుకుని తింటాం. కానీ పై చెక్కుతో సహా జ్యూస్ చేయడం వల్ల మరిన్ని పోషకాలూ, పీచుపదార్థం శరీరానికి అందుతాయని చెబుతున్నారు వైద్యులు.
- తినడం సంగతి అలా ఉంచితే బంగాళాదుంప చెక్కును మెత్తగా నూరి ప్యాక్‌లా వేసి పావుగంట తర్వాత కడిగేస్తే ముఖం తేటగా ఉంటుంది. కళ్లకు అలసట తగ్గుతుంది. మాడిపోయిన గిన్నెలను తోమడానికి కూడా ఆలూచెక్కును వినియోగించవచ్చు.
- చీమలను నిరోధించడానికి దోస పొట్టు బాగా ఉపయోగపడుతుంది.
- కమలా తొక్కలను ఎండబెట్టి తడి లేని డబ్బాలో నిలవ చేయండి. వేడి నీళ్లలో రెండు తొక్కలను మరిగించి చల్లార్చి ఒక చెంచా తేనె వేసుకుని తాగితే రొటీన్‌కు భిన్నమైన రుచితో చాయ్ తాగినట్లూ ఉంటుంది, ఆకలి మందగించడం, అరుచి లాంటి లక్షణాలూ తగ్గుతాయి.
- అరటిపండు తొక్కను మాస్క్‌గా వేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. షూస్ మకిలి వదిలించడానికి కూడా అరటిపండు తొక్కలు ఉపయోగపడతాయి.
- కానీ ఒక్క జాగ్రత్త.. పండ్లు, కూరగాయలను మగ్గడానికి, త్వరగా పాడైపోకుండా తాజాగా కనిపించడానికి రసాయనాలు ఉపయోగిస్తారు కనుక వాటిని ఉప్పునీళ్లతో శుభ్రంగా కడిగి మాత్రమే ఉపయోగించాలి.