Urinary Problems: మూత్ర విసర్జన ఎంత ముఖ్యమో, దాని మీద పట్టూ అంతే ముఖ్యం. మూత్రం వస్తున్నట్టు అనిపించినా విసర్జనకు అనువైన పరిస్థితులు లేనప్పుడు కొంతసేపు ఆపటం మామూలే. కానీ కొందరు మహిళలకిదే పెద్ద సమస్యగా మారుతుంది. మూత్రం వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే విసర్జించాల్సిందే. కొన్నిసార్లు బాత్రూమ్‌కు వెళ్లేలోపే బట్టల్లోనే పడిపోవచ్చు. దీన్నే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఇందులో మూత్రాన్ని పట్టి ఉంచే సామర్థ్యం తగ్గి, అసంకల్పితంగా బయటకు వచ్చేస్తుంటుంది. మాటిమాటికి బాత్రూమ్‌కూ వెళ్లాల్సి రావొచ్చు. కొందరికి నవ్వినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా చుక్కలు చుక్కలుగా మూత్రం లీక్ అవుతుండొచ్చు. ఇది తరచూ చూసేదే. ఒక సంతానం కలిగి, 30 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 60-70% మంది దీంతో బాధపడుతున్నవారే. కొందరు ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. కొందరికి నిత్య సమస్యగానూ వేధించొచ్చు. కొందరికి కొద్ది చుక్కలు మాత్రమే లీకైతే.. కొందరికి బట్టలు తడిసేంతగానూ కావొచ్చు.
ఏమిటీ సమస్య?
మూత్ర విసర్జన తేలికైన వ్యవహారంగానే కనిపిస్తుంటుంది. కానీ ఇందుకోసం మూత్రాశయం(బ్లాడర్), మూత్రమార్గ కండర వలయం (స్ఫింక్టర్), మూత్రాశయం కింద ఉండే దృఢమైన కటి కండరాలు (పెల్విక్ ఫ్లోర్ మజిల్స్), నాడులు.. అన్నీ కలిసి, ఒక సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కిడ్నీల నుంచి తయారైన మూత్రం నాళాల ద్వారా మూత్రాశయంలోకి వచ్చి చేరుతుంది. ఇది విసర్జనకు సిద్ధమయ్యేంతవరకు మూత్రాన్ని పట్టి ఉంచుతుంది. మనం మూత్రాన్ని విసర్జిస్తున్నప్పుడు ముందుగా మూత్రాశయ కండరాలు సంకోచిస్తాయి. అదే సమయంలో మూత్ర మార్గ కండర వలయం, కటి కండరాలు వదులవుతాయి. దీంతో మూత్రమార్గం తెరచుకొని, మూత్రం బయటకు వస్తుంది. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంటే బాత్రూమ్‌కు వెళ్లేంతవరకు మూత్రాన్ని పట్టి ఉంచుకోవటం సాధ్యమవుతుంది. మూత్ర మార్గం తెరచుకోకుండా కటి కండరాలు దాన్ని బిగుతుగా మూసి ఉంచుతాయి మరి. విసర్జనలో నాడుల పాత్రా కీలకమే. మూత్రాశయం దాదాపుగా నిండే స్థితికి వచ్చినప్పుడు.. నిజానికి సగం నిండినప్పట్నుంచే అక్కడి నాడులు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. మెదడు నుంచి సంకేతాలు అందగానే మూత్రాశయం సంకోచిస్తుంది. కండర వలయం, కటి కండరాలు వదులవుతాయి. దీంతో విసర్జన జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైనా మూత్రం లీకయ్యే ప్రమాదముంది.
ప్రధానంగా మూడు రకాలు..
మూత్రం లీకవటం హఠాత్తుగా తలెత్తే సమస్యేమీ కాదు. నెమ్మదిగా మొదలై, క్రమంగా తీవ్రమవుతూ వస్తుంటుంది. మొదట్లో ఒకట్రెండు చుక్కలే పడొచ్చు. అదీ అరుదుగానే కనిపించొచ్చు. లేదూ తరచూ మూత్రం రావటంతోనూ ఆరంభం కావొచ్చు. అయితే రాన్రానూ పెద్దమొత్తంలో, తరచూ లీకవుతూ వస్తుంటుంది. ఆపలేని స్థితికి దారితీయొచ్చు. కొందరికి సమస్య ఉన్నట్టుండీ మొదలవుతుంటుంది. దీన్ని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు.
ఒత్తిడితో సమస్య: కొందరికి దగ్గినా, తుమ్మినా, నవ్వినా, జాగింగ్ వంటి వ్యాయామాలు చేసినా, కింద కూర్చొని పైకి లేచినా, బరువులు ఎత్తినా తెలియకుండానే మూత్రం లీక్ కావొచ్చు. దీన్నే స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఎక్కువమందిలో కనిపించేది ఇదే. కడుపు కండరాలు సంకోచించటం వల్ల మూత్రాశయం, మూత్రమార్గం మీద ఒత్తిడి పడటం దీనికి మూలం. మూత్రాశయంలో మూత్రాన్ని పట్టి ఉంచేందుకు అవసరమైనంతగా మూత్రమార్గ కండర వలయం బిగువుగా లేదనుకోండి. అప్పుడు కొద్దిగా ఒత్తిడి పడినా మూత్రం లీకవుతుంటుంది.
ఆపలేకపోవటం: మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే బాత్రూమ్‌కు పరుగెత్తుకు వెళ్లాల్సి రావటం మరో రకం. దీన్ని 'అర్జ్ ఇన్‌కాంటినెన్స్' అంటారు. కొన్నిసార్లు బాత్రూమ్‌కు వెళ్లే లోపే బట్టల్లో పడిపోవచ్చు కూడా. ఇలాంటి సమస్య గలవారు కుర్చీలోంచి పైకి లేచినప్పుడో, కొద్దిగా నీళ్లు తాగినప్పుడో వెంటనే మూత్రం రావొచ్చు. దీనికి చాలావరకు మూత్రాశయం, మూత్రాశయ కండరాలు అతిగా స్పందించటమే (ఓవర్ యాక్టివ్ బ్లాడర్) కారణం. ఇందులో మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా మూత్రం వస్తున్న భావన కలుగుతుంది. మూత్రానికి వెళ్లినా కొద్దిగానే వస్తుంటుంది. కొందరు రాత్రిపూట చాలాసార్లు విసర్జన కోసం లేస్తుంటారు. ఇది నిద్రనూ దెబ్బతీసి, పలు ఇబ్బందులకు దారితీస్తుంది.
మిశ్రమ సమస్య: కొందరికి ఒత్తిడితో మూత్రం పడటం, మూత్రం ఆపలేకపోవటం రెండూ ఉండొచ్చు (మిక్స్‌డ్ ఇన్‌కాంటినెన్స్). కొందరిలో ఇవి రెండూ ఒకే సమయంలో వేధిస్తుండొచ్చు. కొన్నిసార్లు ఒక రకం మొదలయ్యాక, రెండోది ఆరంభం కావొచ్చు. అయితే ఒకరకం సమస్య లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి.
మహిళల్లో ఎక్కువ..మూత్రం ఆపలేకపోవటం మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువ. పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం.. కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తుంటాయి. మహిళల్లో మూత్రమార్గం చిన్నగా.. పైగా తిన్నగా ఉంటుంది. దీంతో త్వరగా మూత్రం బయటకు వచ్చే అవకాశముంది. వయసు మీద పడుతున్నకొద్దీ కటి, మూత్రాశయ కండరాలూ వదులవుతూ వస్తుంటాయి. కాన్పు సమయంలో జననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కటి కండరాలు సాగటం, బలహీనపడటం కూడా ముప్పు పెరిగేలా చేయొచ్చు. ముఖ్యంగా ఎక్కువ మంది సంతానాన్ని కన్నవారికి, 3 కిలోల కన్నా ఎక్కువ బరువుతో పిల్లలు పుట్టినవారికి దీని ముప్పు ఎక్కువ. మూత్రాశయం, గర్భసంచి కిందికి జారటమూ దీనికి కారణం కావొచ్చు. దీంతో చాలామంది మాటిమాటికి మూత్రం రావటం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, బొట్లుబొట్లుగా పడటం, రాత్రిపూట పక్క తడపటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.