మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కీలకం. సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే ఈ సమస్యతో అనేకమంది బాధపడుతున్నారు. ఇప్పుడు దీనికి కరోనా తోడయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలకు కొవిడ్ దెబ్బకు నిద్ర దూరమైంది. ఇక లాక్డౌన్ విధించిన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందట. ఈ క్రమంలో నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్న బాధితులు పెరిగినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతుననట్లు స్పష్టం చేశారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలిపారు.
నిద్రలేమి సమస్య ఎందుకు తలెత్తుతుంది? ఎలా మొదలవుతుంది? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? వంటి అనేక అంశాలపై అనుమానాలు నివృతి చేశారు డైరెక్టర్ స్లీప్ మెడిసన్, సీనియర్ న్యూరాలజిస్ట్ డా.మన్వీర్ భాటియా.
"నిద్రలేమితో బాధపడుతున్న అన్ని వయసుల మహిళలు, పురుషులతోనూ నేను మాట్లాడాను. ఈ రుగ్మతకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికి అనేక కారణాలుంటాయి. లాక్డౌన్ వల్ల ఉద్యోగంపై అభద్రత భావం, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులపై ఆందోళన, అమితంగా ప్రేమించే వారి ఆరోగ్య భద్రత వంటివి కారణాలు నిద్రలేకుండా చేస్తాయి. ఒత్తిడి పెరిగే కొద్ది శరీరంలో హార్మోన్లు విడుదలై నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఇతరుల వల్ల తమకు కరోనా సోకుతుందనే భయం కూడా ఈ సమస్యకు ఓ కారణం కావొచ్చు."
-మన్వీర్ భాటియా, న్యూరాలజిస్ట్