పిల్లలు చదువుల్లో బాగా రాణించాలని, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. అలాగని అస్తమానం పుస్తకాలు ముందేసుకొని చదువుకోమని మాత్రం పురమాయించకండి. రోజూ క్రమం తప్పకుండా పరుగెత్తుతూ ఉండమని చెప్పండి. శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్) ఇనుమడించిన కొద్దీ పరీక్షల్లో మార్కులూ పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ జెనీవా అధ్యయనం పేర్కొంటోంది.
దగ్గరి సంబంధం..
గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యానికీ మేధాశక్తికీ దగ్గరి సంబంధం ఉంది మరి. ఇదే చదువుల్లో రాణించటానికి, మంచి మార్కులు తెచ్చుకోవటానికి తోడ్పడుతోంది. పరిశోధకులు 8 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలను ఎంచుకొని.. శరీర సామర్థ్యం, తెలివి తేటలకు మధ్య గల సంబంధాన్ని అంచనా వేశారు. విషయగ్రహణ నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవటానికి ముందు వీరికి పరుగెత్తే వ్యాయామాలను చేయాలని సూచించారు. శరీర సామర్థ్యం ఎక్కువగా గల పిల్లలు లెక్కల్లో, భాషా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవటం గమనార్హం.