తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మనిషిని బట్టి డిప్రెషన్​ మారుతుంది! - how to recognize depression

అనుకున్నది జరగకపోతే బాధ కలుగుతుంది.. పదే పదే బాధ పడితే అది డిప్రెషన్​కు దారితీస్తుంది. అయితే, ఈ డిప్రెషన్​ అందరిలో ఒకేలా ఉండదు. మనిషిని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. మరి మీరు బాధ పడుతున్నారా, డిప్రెషన్​లో ఉన్నారా తెలుసుకోవాలనుందా? అయితే, ఈ కథనం మీకోసమే...

types of depression and how to identify depression
మనిషిని బట్టి డిప్రెషన్​ మారుతుంది!

By

Published : Jun 20, 2020, 11:18 AM IST

ఎప్పుడో అప్పుడు బాధ పడటం, కొద్దిరోజుల్లో కోలుకోవటం మామూలే. కానీ మనసులో ఏదో తెలియని వెలితి, దేని మీదా ఆసక్తి లేకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిద్ర పట్టకపోవటం వంటివి 2 వారాలు, అంతకన్నా ఎక్కువ కాలం వేధిస్తుంటే తాత్సారం చేయటానికి వీల్లేదు. కుంగుబాటు (డిప్రెషన్‌) మూలంగా ఇలాంటివి పొడసూపుతుండొచ్చు. చిత్రమేంటంటే- కుంగుబాటు అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. రకరకాల రూపాల్లో దాడిచేయొచ్చు. లక్షణాలు కూడా వేర్వేరుగా కనిపిస్తుండొచ్చు. అందువల్ల కుంగుబాటు రకాలపై ఓ కన్నేద్దాం.

  • నిరంతర కుంగుబాటు (పర్సిస్టెంట్‌)


ఇందులో కుంగుబాటు లక్షణాలు ఏళ్లకొద్దీ విడవకుండా వేధిస్తుంటాయి. కనీసం రెండేళ్లుగా విచారం, బాధ వంటి లక్షణాలతో బాధపడుతుంటే నిరంతర కుంగుబాటుగా భావిస్తారు. ఇది మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు, యుక్తవయసు వాళ్లూ దీని బారినపడొచ్చు. వీరిలో కుంగుబాటు కన్నా చిరాకు ఎక్కువగా కనిపిస్తుంది.

  • ప్రధాన కుంగుబాటు (మేజర్‌)


చాలామందిలో తరచుగా కనిపించే రకం ఇది. క్లినికల్‌ డిప్రెషన్‌ అనీ పిలుస్తారు. సుమారు 2 కోట్ల మందికి పైగా దీంతో బాధపడుతున్నారని అంచనా. విచారం, ఆసక్తి తగ్గటం, నిద్రపట్టకపోవటం, నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది, ఏకాగ్రత కుదరకపోవటం, మగతగా ఉండటం, ఆత్మహత్య ఆలోచనలు లేదా ఆత్మహత్యకు ప్రయత్నించటం వంటి లక్షణాలను బట్టి డాక్టర్లు సమస్యను నిర్ధరిస్తారు. దీర్ఘకాలంగా వీటిల్లో కనీసం ఐదు లక్షణాలు కనిపిస్తుంటే కుంగుబాటుతో బాధపడుతున్నట్టే భావించొచ్చు.

  • కాలాల వారీగా (సీజనల్‌)


ఇందులో కుంగుబాటు లక్షణాలు కొన్నికాలాల్లోనే.. ముఖ్యంగా పగటి వెలుగు తక్కువగా ఉండే శీతకాలంలోనే కనిపిస్తుంటాయి. చాలామందిలో ఎండకాలం మొదలవుతూనే ఇదీ తగ్గిపోతుంది. అయితే కొందరికి విచారం, బాధ వంటివి కాస్త ఎక్కువగా వేధిస్తుండొచ్చు. ఇలాంటివారికి కాంతి చికిత్స లేదా మందులు బాగా తోడ్పడతాయి.

  • హుషారు-నిరాశ (బైపోలార్‌)

కొంతకాలం తనంత గొప్పవాడు లేడని విర్రవీగేంత ఉత్సాహం. మరికొంతకాలం అంతా అయిపోయిందన్నంత నిరాశ. బైపోలార్‌ డిజార్డర్‌ ముఖ్య లక్షణమిది. ఇలా మూడ్‌ తరచుగా మారిపోవటం మానసిక భావనలకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. ప్రవర్తన, నిర్ణయాలను తీసుకోవటం మీదా ప్రభావం చూపుతుంది. ఇవి ఉద్యోగం, సంబంధాలు, రోజువారీ జీవితంలో ఇబ్బందులూ తెచ్చిపెడతాయి. ఆత్మహత్య ఆలోచనలు, ఆత్మహత్యకు ప్రయత్నించటం కూడా ఎక్కువే.

  • కాన్పు అనంతరం (పోస్ట్‌పార్టమ్‌)


కొందరికి కాన్పు తర్వాత కుంగుబాటు మొదలవుతుంటుంది. వీరిలో మూడ్‌ మారిపోవటం, బిడ్డను అంతగా దగ్గరికి తీసుకోకపోవటం, ఆలోచనలు, ప్రవర్తనలో మార్పులు రావటం, బిడ్డను సరిగా పెంచలేమోననే భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఇవి ఏడాది తర్వాత కూడా ఉంటుండొచ్చు. ఇలాంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఇదీ చదవండి:ఆ నీటిని తాగండి.. కరోనాను తరిమికొట్టండి!

ABOUT THE AUTHOR

...view details