కరోనా సోకి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నవారిలో ఎన్నో అనుమానాలుంటాయి. వ్యాధి తీవ్రతను ఎలా అంచనా వేయాలో తెలియక ఆందోళన పడిపోతుంటారు. ఇలాంటి వారికోసం తేలికైన రెండు లక్షణాలు ఎంతగానో ఉపయోగపడగలవని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. అవి 1. శ్వాస త్వరత్వరగా తీసుకోవటం. 2. ఆక్సిజన్ 91 శాతం కన్నా పడిపోవటం. ఇవి రెండూ ప్రాణాపాయ స్థితిని అంచనా వేయటానికి తోడ్పడే సూచికలుగా గుర్తించాలని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ నీల్ ఛటర్జీ పేర్కొంటున్నారు.
కొవిడ్ తొలిదశలో ఆయాసమేమీ ఉండకపోవచ్చు. ఆక్సిజన్ శాతం తగ్గిపోయినా లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆయాసం, ఛాతీలో విడవకుండా నొప్పి లేదా ఏదో నొక్కుతున్నట్టు అనిపించటం వంటి తీవ్ర లక్షణాలేవీ లేకపోయినా శ్వాస వేగం పెరగటం, రక్తంలో ఆక్సిజన్ ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదని నీల్ ఛటర్జీ చెబుతున్నారు. పరిస్థితి ముదిరి చివరికి ఆసుపత్రికి వచ్చేసరికే చికిత్స ఆరంభించాల్సిన విలువైన సమయం గడిచిపోతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు. ఆక్సిజన్ పడిపోయినవారికి బయటి నుంచి ఆక్సిజన్ ఇవ్వటం తప్పనిసరి. ఇలా ఆక్సిజన్ తీసుకుంటున్నవారిలోనే స్టిరాయిడ్ల ప్రాణరక్షణ ప్రభావాలు బాగా కనిపిస్తాయన్న సంగతిని గుర్తించాలని చెబుతున్నారు.