Tulasi Health Benefits : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. శీతాకాలంలో ఇవి సాధారణమే అయినప్పటికీ, వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అందుకోసం మంచి ఔషధ గుణాలున్న తులసి కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసికి భారత సంప్రదాయాలలోనే కాదు, ఔషధపరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి కాలానుగుణ వ్యాధుల నివారణలో తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తులసి అకులతో చేసే కషాయాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలో పెరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలోనూ ఇవి సహాయపడతాయి. తులసి కషాయాన్ని పరగడుపునే తాగటం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులను పచ్చిగా తీసుకోవడం కంటే, దాన్ని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అందుకే తులసి కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ శక్తిని పెంచుతుంది :
తులసిలో జీర్ణశక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే తులసి కషాయం తాగితే, జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. క్యాలరీలు త్వరగా కరిగి శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది :
ఒత్తిడిని నియంత్రించడంలోనూ తులసి కషాయం ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా యాంటీ యాంగ్జయిటీ లక్షణాలను, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ పరిశోధనల ప్రకారం, తులసిలో ఓర్పును పెంచే గుణంతో పాటు, ఆందోళన నుంచి ఉపశమనం కలిగించే లక్షణం కూడా ఉంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు :
బరువు అదుపులో ఉంచుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకం చాలా ముఖ్యమైనది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దోహదపడతాయి.
జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది :
అల్లం, జీలకర్ర, సోపు లాంటి వాటితో కలిపి, తులసి కషాయం తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరం పోషకాలను సులువుగా గ్రహించగలుగుతుంది.