140 ఏళ్ల క్రితం జర్మనీకి చెందిన రాబర్ట్ ఖోష్ క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాను కనుగొన్నారు. తద్వారా క్షయ వ్యాధి చికిత్స సులభసాధ్యమైంది. అయినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం..
- 2000 సం. నుంచి ఇప్పటి వరకు 6.3 కోట్ల మంది క్షయ వ్యాధి నుంచి కోలుకున్నారు.
- 2019 సం.లో కోటి మందికి క్షయ వ్యాధి సోకింది.
- 2019 లోనే 14 లక్షల మంది క్షయ సోకి మరణించారు.
- ఇదే సం.లో 4,65,000 మందికి.. ఔషధాలకు లొంగని లేదా ఔషధాలను తట్టుకుని నిలబడే క్షయ సోకింది.
నిస్సందేహంగా, జనాభాను నిర్మూలించగలిగే అంటువ్యాధులలో క్షయ కూడా ఒకటి. అందువల్ల దీన్ని నిలువరించటానికి ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయిలోనే జరగాలి.
క్షయ వ్యాధి అంటే?
మైకోబ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు కలుగుతుంది. అనారోగ్యకర జీవన విధానాన్ని గడిపే వారు, అతిగా మద్యం తాగేవారు, ధూమపాన ప్రియులు, తక్కువ వ్యాధి నిరోధక శక్తి కలవారు ఈ వ్యాధి బారిన పడతారని హైదరాబాద్ వి.ఐ.ఎన్.ఎన్. హాస్పటల్ లో వైద్యునిగా పనిచేసే డా.రాజేష్ ఉక్కల చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా ఊపిరితిత్తులను ఆశ్రయించి పాడుచేసినా మూత్రపిండాలు, మెదడు, వెన్నెముక మొదలైన ఇతర శరీర భాగాలను వ్యాధిగ్రస్థం చేస్తుంది.
లక్షణాలు, రోగ నిర్ధరణ:
రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి క్షయ వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినా కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించవని దానికి కారణం వారికున్న రోగ నిరోధక శక్తి అని ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ధ్రువీకరించింది. క్షయ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉండవచ్చు.
- దగ్గు (కొన్ని సార్లు రక్తంతో కూడి)
- ఛాతీలో నొప్పి
- బలహీనత
- బరువు కోల్పోవటం
- జ్వరం
- రాత్రిళ్లు చెమట పట్టడం
ఇవేకాక ఆకలి తగ్గడం, వణుకు కలగవచ్చు. క్షయ వ్యాధిని నిర్ధరించటానికి చేయాల్సిన పరీక్షలను డా.ఉక్కల వివరించారు.
- గళ్ల పరీక్ష
- ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ పరీక్ష (ఇ.ఎస్.ఆర్.)
- పి.సి.ఆర్. పరీక్ష
చికిత్స:
క్షయ వ్యాధి చికిత్సకు లొంగేదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియచేస్తోంది. 4 యాంటిబయాటిక్ ఔషధాలతో 6 నెలల పాటు చేసే ప్రామాణీకరించిన చికిత్స ఇది. రిఫామైసిన్, ఐసోనియాజిడ్లు సాధారణ ఔషధాలు. కొన్ని సార్లు కొంత మందిలో ఈ ఔషధాలకు ఫలితం కనిపించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మరింత కాలం విభిన్నమైన చికిత్సలు చేయాలి. వీరికి ప్రత్యేక చికిత్స అందించకపోతే ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా మరింత విస్తరిస్తుంది.
క్షయ, కొవిడ్ 19:
క్షయ సోకిన వారిలో రోగ నిరోధక శక్తి బలహీన పడిందని అర్థం చేసుకోవాలి. అందుకే వారు కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- జన సమూహలకు దూరంగా ఉండాలి.
- తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
- ఇతరుల నుండి కనీసం 6 అడుగుల దూరం పాటించండి.
- దగ్గే వారి నుంచి, తుమ్మే వారి నుంచి దూరంగా ఉండండి.
- తరచూ చేతులు కడుక్కోండి.
- కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించండి.
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి.