weight loss techniques: అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు మొదలుపెడితే.. మరికొందరు తమ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు.. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కొన్ని పదార్థాలకు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
ప్రత్యామ్నాయాలు మంచివి!
అధిక క్యాలరీలు, కొవ్వులతో నిండి ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటికి బదులుగా తక్కువ క్యాలరీలు, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చక్కెరలు, ఉప్పు తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువూ తగ్గచ్చు.
చల్లచల్లగా తాగాలనిపిస్తే..!
శీతల పానీయాల్లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ అధికంగా కలుపుతారు. ఇవి అధిక బరువుతో పాటు గుండె సమస్యలు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. వీటికి బదులు పచ్చి మామిడికాయలు, బెల్లం, ఉప్పు, జీలకర్ర, పుదీనా, యాలకులతో తయారుచేసిన ‘ఆమ్ పన్నా’ తీసుకుంటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలాగే శరీరానికి శక్తినిచ్చే ఖనిజలవణాల స్థాయులూ ఎక్కువవుతాయి. ఇక పచ్చిమామిడిలో ఉండే విటమిన్ ‘సి’ బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఐరన్ జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సాస్‌లకు బదులు..
చిప్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్.. వంటివి తినాలంటే వాటికి తోడు సాస్ ఉండాల్సిందే. అయితే ఈ సాస్‌లలో మోతాదుకు మించి చక్కెర, ఉప్పు కలుపుతుంటారు. వీటిలో అధిక క్యాలరీలు కూడా నిండి ఉంటాయి. ఇవి బరువును పెంచడమే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. అందుకే వీటికి బదులు ఇంట్లో పులియబెట్టి తయారుచేసిన పచ్చళ్లను వాడడమే శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వీటిలోని మంచి బ్యాక్టీరియా పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ పచ్చళ్లలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువూ తగ్గచ్చు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా రోజుకు ఒకట్రెండు టీస్పూన్లు చాలంటున్నారు.