Treatment For Constipation In Children :చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య మలబద్ధకం. డబ్బా పాలు, ఆవు/ గేదె పాలు తాగే పిల్లల్లో ఈ సమస్య తలెత్తవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన నీరు, పోషకాలు అందని పసివాళ్లలోనూ ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
మల విసర్జన చేసేటప్పుడు ఏడుస్తున్నారా?
మల బద్ధకం ఉన్న పిల్లలు మల విసర్జన సరిగ్గా చేయలేకపోవడం, మల విసర్జన సమయంలో ఏడవడం లాంటివి చేస్తారు. తల్లిదండ్రులు ఈ సమస్యను వెంటనే గుర్తించకపోతే పిల్లల కడుపు గట్టిగా మారి నీరసించిపోతారు. కనుక పిల్లలు మల, మూత్రాల విసర్జన సరిగ్గా చేస్తుందీ, లేనిది తల్లదండ్రులు క్రమం తప్పకుండా గమనించాలి. తల్లి పాలు కాకుండా బర్రె పాలు, డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, పౌడర్ పాలు తాగే పిల్లల్లో.. అవి అరగకపోవడం వల్ల మల బద్ధకం అనే సమస్య ఏర్పడుతుంది.
ఈ మలబద్ధకానికి తక్షణ పరిష్కారం ఏమిటంటే.. పిల్లలకు పడుతున్న పాలలో కాసిన్ని నీళ్లు కలిపితే పిల్లలు సులువుగా వాటిని అరిగించుకోగలరు. ఒక వేళ డబ్బా పాలు, పౌడర్ పాలు తాగేవారిలో మలబద్ధకం ఉంటే.. వెంటనే వాటిని ఆపించేయాలి. తల్లిపాలను అలవాటు చేయాలి. అలా వీలుకాకపోతే.. డాక్టర్ల సలహాతో మంచి కంపెనీ పాలను, పౌడర్లను వాడుకోవాలి. ఇవన్నీ చేసినా పిల్లల్లో మల బద్దకం సమస్య తగ్గలేదంటే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉందంటున్నారు నిపుణులు.
చిన్న చిట్కాలతో ఎంతో మేలు
పిల్లల్లో మలబద్ధకం తగ్గించడానికి ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టి, మరునాడు ఆ నీళ్లలోనే వాటిని బాగా పిసికి పిల్లలతో తాగించాలి. ఇలా చేయడం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది. అంతేకాకుండా పిల్లల్లోని ఐరన్ లోపం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పిల్లల్లో మల బద్ధకం ఉంటే గతంలో ఆముదం పట్టేవారు. ప్రస్తుతం చాలా మంది ఆముదం పెట్టడం మానేశారు. కానీ, నిజానికి ఆముదం పట్టడం వల్ల పిల్లల కడుపు శుభ్రమవుతుంది.