Tooth Discoloration: ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చల్లానే.. చాలా మందిని వేధించే మరో సమస్య పళ్ల రంగు. కొందరి పళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇలాంటప్పుడు వారు నలుగురిలో నవ్వాలన్నా నవ్వలేకపోతుంటారు. అయితే.. అసలు పళ్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పారు ప్రముఖ దంత వైద్యులు డా. ఎం. ప్రసాద్. పళ్లు రంగు మారడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయని తెలిపారు. అసలు పళ్లపై మరకలు ఎలా వచ్చాయనేది తెలుసుకుంటే.. పరిష్కారం దొరుకుతుందని వివరించారు.
''కాఫీ, టీ, సిగరెట్ తాగడం, పొగాకు నమలడం.. ఇవన్నీ బాహ్యకారకాలు. ఇది ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చేది. ఇలా పళ్లు రంగు మారొచ్చు. రెండోది చిగుళ్లలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే.. పాచి పట్టిన పసుపు రంగులో పళ్లు కనిపిస్తాయి. ఇది కూడా బయట నుంచి వచ్చేదే. మరొకటి.. ఇంట్రిన్సిక్ స్టెయిన్. పళ్లు తయారయ్యేప్పుడే మరకలు ఉంటాయి. మనం బ్రష్ చేసుకొని క్లీనింగ్ చేసినప్పుడు మరకలు రంగు పోయి నార్మల్గా ఉంటే అది ఎక్ట్రెన్సిక్ స్టెయిన్. అలవాట్లు మార్చుకొని ఆ సమస్య తగ్గించుకోవచ్చు. లోపల నుంచి అలా వచ్చాయంటే.. కోటింగ్, వెనీరింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ముందు ఎలా వస్తున్నాయో తెలుసుకొని దానికి తగ్గట్లు ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.''