Tonsils Ayurvedic Home Remedy in Telugu :మనలో చాలామంది టాన్సిల్స్ సమస్యతో బాధపడుతుండటం తరుచూ చూస్తుంటాం. మన ఇంట్లోని చిన్న పిల్లలు, కొన్ని సందర్భాల్లో పెద్దలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే టాన్సిల్స్ అనేవి ఆస్పత్రికి వెళ్లాల్సినంత ఆరోగ్య సమస్య కాదు, అలా అని పట్టించుకోనంత పరిస్థితి కాదు. దీనికోసం ఆయుర్వేదంలో ఎంతో చక్కటి ఉపాయం ఉంది. టాన్సిల్స్ సమస్య నుంచి విముక్తి కోసం ఆయుర్వేదం మార్గంలో చక్కటి కషాయం తయారు చేసుకోవచ్చు. కషాయం ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో వివరించడం సహా ఉపశమనం కోసం ఏం చేయాలో కూడా ఆయుర్వేదంలో వివరించారు.
"టాన్సిల్స్ లేదా టాన్సిలైటిస్‌తో బాధపడే వాళ్లు పటిక భస్మాన్ని వేడి నీటిలో కలిపి వాడటం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే తిప్పతీగ, యష్టిమధు, గుగ్గిళ్లు, తేనెతో తయారు చేసే కషాయాన్ని క్రమం తప్పకుండా వాడితే అతి తక్కువ సమయంలో టాన్సిల్స్ నుంచి విముక్తి పొందవచ్చు."
-డా.గాయత్రీ దేవి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
ఉపశమనం కోసం ఇలా చేయండి:
టాన్సిల్స్ నుంచి ఉపశమనం కోసం ముందుగా పటికను తీసుకోవాలి. పటిక యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. పటికను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మూకుట్లో వేసి పాప్ కార్న్ మాదిరి పొంగించుకోవాలి. దీని వల్ల పటికలోని నీరు అంతా ఎగిరిపోతుంది. దానిని చేతిలో ఒత్తుకుంటే పొడి వస్తుంది. దీనినే పటిక (స్పటిక) భస్మం అంటారు. టాన్సిలైటిల్ లేదా టాన్సిల్స్ సమస్యతో ఉన్న వాళ్లు ఉపశమనం కోసం దీనిని ఉపయోగించుకోవాలి. వేడి నీళ్లను ఒక కప్పు తీసుకొని, అందులో అరచెంచా పటిక భస్మాన్ని వేసి కలుపుకోవాలి. ఈ నీటిని గొంతు వరకు చేరేలా పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల టాన్సిల్స్‌తో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం ఇలా పుక్కిలించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.