తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చిరుతిండితో ఆరోగ్యానికి పెద్ద సాయం! - Nuts benefits for health

ఒకేసారి కడుపు నిండా భోజనం చేయటం కన్నా కొద్ది కొద్దిగా తినటం.. అవసరమైతే కాస్త ఆకలి అనిపించినప్పుడు మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినటం మంచిది. బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌), పండ్లు తీసుకోవటం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

to take as food Nuts benefits for health
చిరుతిండి..పెద్ద సాయం!

By

Published : Oct 19, 2020, 12:16 PM IST

కడుపు నిండా భోజనం చేసేసి 'హమ్మయ్య.. ఓ పనైపోయింది' అనుకునేవారు ఎందరో. ఒకసారి భోజనం చేశాక మరేమీ తినాల్సిన అవసరముండదన్నది వీరి భావన. నిజానికి ఒకేసారి కడుపు నిండా భోజనం చేయటం కన్నా కొద్ది కొద్దిగా తినటం.. అవసరమైతే కాస్త ఆకలి అనిపించినప్పుడు మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినటం మంచిది. ఇది శరీరానికే కాదు, మనసుకూ మేలు చేస్తుంది. చిరుతిళ్లతో బరువు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే.. మరికొన్ని ఖండిస్తున్నాయి.

అవి కాసేపే..

వీటి మాటెలా ఉన్నా చిరుతిళ్ల మూలంగా ఒకేసారి పెద్ద మొత్తంలో తినకుండా చూసుకోవచ్ఛు ఎందుకంటే అతిగా ఆకలి వేయటం తగ్గుతుంది. మన శరీరం ఎప్పుడూ మనతో ఏదో చెప్పాలనే అనుకుంటూ ఉంటుంది. దాన్ని వినటం మంచిది. కడుపులో చిన్నగా ఆకలి అవుతున్నట్టు అనిపిస్తే ఏదో ఒకటి నోట్లో వేసుకోవటమే ఉత్తమం. అలాగని చిప్స్‌, కేక్‌లు, చాక్లెట్లు, కూల్‌డ్రింకుల వంటి వాటి జోలికి వెళ్లటం తగదు. ఇవి రక్తంలో గ్లూకోజు త్వరగా కలిసేలా చేస్తాయి. వీటితో లభించిన హుషారు కాసేపటికే ఆవిరవుతుంది.

వీటితో గుండెకు మేలు

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌), పండ్లు తీసుకోవటం మంచిది. గింజపప్పుల్లోని బహుళ అసంతృప్త కొవ్వులు, పీచు, ప్రొటీన్‌, మెగ్నీషియం, క్యాల్షియం గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. తరచూ బాదం పప్పు తీసుకుంటుంటే మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ మెరుగవుతుంది. ప్రొటీన్‌తో కండర మోతాదు, శక్తి పుంజుకుంటాయి. మనం భోజనం చేసినప్పుడు శరీరం అందులోని ప్రొటీన్‌ను పూర్తిస్థాయిలో స్వీకరించకపోవచ్ఛు. అదే అప్పుడప్పుడు ప్రొటీన్‌తో నిండిన చిరుతిళ్లు తీసుకుంటే దాన్ని రోజంతా లభించేలా చూసుకోవచ్ఛు.

సంకట విమోచనం..

ఇది 60 ఏళ్లు పైబడినవారికి మరింత ముఖ్యం. చిన్న వయసులో మాదిరిగా పెద్ద వయసులో శరీరం అంత సమర్థంగా ప్రొటీన్‌ను ఉపయోగించుకోలేదు. అందువల్ల వయసు మీద పడినవారు తగినంత ప్రొటీన్‌ తీసుకోకపోతే శక్తి సన్నగిల్లి కింద పడిపోవటం, ఎముకలు విరగటం వంటి ముప్పులు పెరుగుతాయి. తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినటం మధుమేహులకూ మేలే. రక్తంలో గ్లూకోజు స్థాయులు నిలకడగా ఉంటాయి. చిరుతిళ్ల మూలంగా మూడ్‌ సైతం మెరుగవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన చిరుతిండితో జ్ఞాపకశక్తి, విషయగ్రహణ సామర్థ్యం పుంజుకుంటాయి. ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యల లక్షణాలూ తగ్గుముఖం పడతాయి.

భోజనానికీ భోజనానికీ మధ్య చాలా ఎడం ఉంటే శరీరం గ్లూకోజు స్థాయులను సరిదిద్దటానికి కార్టిజోల్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సైటోకైన్ల వంటి వాపు కారకాలు విడుదలయ్యేలా చేస్తుంది. ఫలితంగా ఆందోళన, కుంగుబాటు లక్షణాలు తలెత్తుతాయి. వీటిని చిరుతిండితో దూరం చేసుకోవచ్ఛు బ్లూ బెర్రీ వంటి పండ్లు వయసుతో పాటు తలెత్తే మతిమరుపు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల బయటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లో, యాపిళ్లో, గింజపప్పులో వెంట తీసుకెళ్లండి. కడుపులో కాస్త ఎలుకలు పరుగెడుతున్నట్టు అనిపిస్తే నోటికి పని చెప్పండి. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం సొంతం చేసుకోవచ్ఛు.

ఇదీ చూడండి:కలబందతో కొత్త మెరుపు!

ABOUT THE AUTHOR

...view details