కరోనా భయం వెంటాడుతోందా? మిత్రులను, బంధువులను కలవలేకపోతున్నామని.. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నామని బెంగ పడుతున్నారా? ఇవన్నీ ఆందోళన, కుంగుబాటు లక్షణాలకు దారితీస్తున్నాయా? అయితే '45 నిమిషాల సూత్రం' పాటించండి. ఇది చాలా తేలికైనది. చాలామంది ఆచరించదగినది కూడా. దీన్ని అనుసరిస్తే ఆందోళన, కుంగుబాటు మూలంగా తలెత్తే ప్రతికూల భావనల నుంచి బయటపడటం తథ్యమన్నది చైనా పరిశోధకుల సూచన. కొవిడ్-19 పతాక స్థాయికి చేరుకున్న సమయంలో కలాశాల విద్యార్థులపై తాము నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని నిరూపించిందని చెబుతున్నారు. ఇంతకీ ఆ అద్భుత సూత్రం ఏంటో తెలుసా?
- ప్రతి రోజూ 45 నిమిషాల సేపు కఠినమైన వ్యాయామం, శారీరక శ్రమ చేయటం.
- మరీ ముప్పావు గంట సేపు, అదీ కఠినమైన వ్యాయామాలేం చేస్తామని పెదవి విరవకండి. తక్కువ కఠినమైన వ్యాయామాలైతే 80 నిమిషాల సేపు చేసినా సరే. పోనీ తేలికైన వ్యాయామాలే కావాలనుకుంటే.. 108 నిమిషాల సేపు చేసినా చాలు.
దీన్ని పాటించినవారిలో నిరాశ, నిస్పృహ వంటి ప్రతికూల భావనలు చాలావరకు తగ్గిపోవటం విశేషం. ఈ కాలేజీ విద్యార్థుల్లో ఎవరూ కొవిడ్-19 బారినపడకపోవటం విశేషం. ఇతరులకు దూరంగా ఉండటం, కరోనా మీద నెలకొన్న భయం వంటివే వీరిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలకు బీజం వేయటం. అందువల్ల కరోనా భయం, ఇతరులను కలవలేకపోవటం వల్ల తలెత్తే ప్రతికూల భావనల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి మరింత ఎక్కువ వ్యాయామం, శ్రమ చేయటం అవసరమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. వ్యాయామం, శారీరక శ్రమతో మెదడులో డొపమైన్ వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి ఉత్సాహాన్ని, హుషారును కలగిస్తాయి. ఏకాగ్రత పెరగటం వల్ల లేనిపోని ఆలోచనలు, భయాలు మనసును వేధించవు. మరింకేం.. వెంటనే 45 నిమిషాల సూత్రాన్ని పాటించటం ఆరంభించండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ..
వ్యాయామ ప్రాధాన్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గట్టిగా నొక్కి చెబుతోంది. దీని విషయంలో కొత్త మార్గదర్శకాలనూ రూపొందించింది. వీటిని త్వరలోనే అన్ని దేశాలు ఆమోదించనున్నాయి. కరోనా మూలంగా చాలామంది ఇంటికే పరిమితమవుతుండటం, ఇది మధుమేహం వంటి సాంక్రమికేతర జబ్బులు పెరగటానికి దారితీసే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించటం గమనార్హం. ఇందులో ప్రధానాంశం పెద్దవాళ్లంతా వారానికి కనీసం 150-300 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి కఠినమైన ఏరోబిక్(గుండె వేగంగా కొట్టుకునేలా, ఆక్సిజన్‌ను మరింత ఎక్కువగా గ్రహించేలా చేసేవి) వ్యాయామాలు చేయాలని సూచించటం. దీర్ఘకాల జబ్బులు లేదా వైకల్యంతో బాధపడుతున్నవారికీ ఇదే నియమం వర్తిస్తుంది. పిల్లలు, యుక్తవయసు వారైతే రోజుకు సగటున 60 నిమిషాల సేపు వ్యాయామం అవసరం. వృద్ధులైతే కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలతో పాటు శరీర నియంత్రణ, సమన్వయానికి తోడ్పడే వాటి మీదా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. ఇవి తూలి కింద పడిపోవటాన్ని నివారిస్తాయి. మొత్తంగా ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.