కాళ్లలో ఏదో పాకుతున్నట్టో, దురద పెడుతున్నట్టో ఉండొచ్చు. లేదూ లాగుతున్నట్టో, మండుతున్నట్టో, సూదులతో పొడుస్తున్నట్టో అనిపించొచ్చు. మొత్తమ్మీదో ఏదో అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే అప్రయత్నంగా కాళ్లను కదిలించటం మొదలవుతుంది. ఇలా అదేపనిగా కాళ్లను కదిపే సమస్య (రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్- ఆర్ఎల్ఎస్) తరచూ చూసేదే. చాలామంది ఇదేమీ హాని చేయదనే భావిస్తుంటారు. నిజానికిది తీవ్రమైన సమస్యేమీ కాదు కూడా. కానీ నిద్రను బాగానే ప్రభావితం చేస్తుంది. సాయంత్రం, రాత్రి వేళల్లోనే దీని లక్షణాలు తీవ్రమవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో దీన్నుంచి ఉపశమనం పొందే అవకాశం లేకపోలేదు.
ఆలస్యంగా నిద్రించటం
రాత్రిపూట కాస్త ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున కాస్త ఆలస్యంగా లేవటం మంచి ఫలితం చూపిస్తుంది. తెల్లవారు జామున పట్టే గాఢ నిద్ర పొద్దున హుషారు, హాయి భావనను కలిగిస్తుంది.
వేళకు పడుకోవటం
రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకుంటే కొంతవరకు కాళ్లను కదిలించటాన్ని సరిచేసుకోవచ్చు. ఎంతసేపు నిద్రపోతే హాయిగా ఉంటుందనేది ఎవరికి వారే తెలుసుకొని, ఆచరించాలి. చాలామందికి రోజుకు 7-9 గంటల నిద్ర అవసరమవుతుంది.
పడుకోవటానికి ముందు సాగదీత
రాత్రి పడుకోవటానికి ముందు కాలి కండరాలను నెమ్మదిగా సాగదీసే ప్రయత్నం చేయాలి. ఇందుకు పిక్క సాగదీత వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. తిన్నగా నిల్చొని, ఒక కాలును ముందుకు జరపాలి. వెనక కాలు, వీపును తిన్నగా ఉంచుతూ ముందు కాలు మీద బరువు వేసి వంగాలి. కాసేపు అలాగే ఉండి.. రెండో కాలుతోనూ ఇలాగే చేయాలి. దీంతో పిక్క కండరాలు సాగి అసౌకర్యం తగ్గుతుంది. కాలి కండరాలను సాగదీసే యోగాసనాలూ ఉపయోగపడతాయి.
మర్దన
పడుకునే ముందు పిక్క కండరాలను నెమ్మదిగా మర్దన చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది కాళ్లకు హాయిని కలిగించటమే కాదు, నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది.