Tips To Follow After Lunch: మధ్యాహ్న భోజనం అనంతరం.. సాయంత్రం అవుతున్నకొద్దీ చాలామందికి కాస్త బడలికగా, హుషారు తగ్గినట్టుగా అనిపించటం సహజమే. ఇలాంటి సమయంలో చాలామంది చేసే పని కాఫీ, టీ, కూల్‌డ్రింకులు తాగటం. సమోసాలు, పకోడీల వంటివి లాగించటం. ఇవి కొంత ఉత్సాహాన్ని కలిగించినా అనర్థాలు లేకపోలేదు. మరి వీటితో పనిలేకుండా తిరిగి ఉత్సాహాన్ని పొందటమెలా?
ఒకింత నడక: గంటలకొద్దీ అదేపనిగా, అంతే ఉత్సాహంగా పనిచేయటానికి శరీరం సహకరించదు. ఒంట్లో కార్టిజోల్ హార్మోన్ మోతాదులు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. దీని మోతాదులు తగ్గినప్పుడు నిరుత్సాహంగానూ అనిపిస్తుంటుంది. అందువల్ల కుర్చీలోంచి లేచి నాలుగడుగులు వేయటం మంచిది. దీంతో రక్త ప్రసరణ పుంజుకొని ఉత్సాహం వస్తుంది. ఇంటి చుట్టో, ఆఫీసు చుట్టో నడిచినా చాలు. పరిసరాల దృశ్యాలూ మనసును ఉత్తేజితం చేసి, హుషారును తెచ్చిపెడతాయి.
మంచి అల్పాహారం:రోజంతా శక్తిని సమకూర్చుకోవటానికి పునాది ఉదయాన్నే వేసుకోవాలి. ఇందుకు ఉత్తమ మార్గం అల్పాహారం. మంచి పోషకాలతో కూడిన అల్పాహారంతో చురుకుదనం ఏకాగ్రత, సమస్యల పరిష్కారం, పనిలో సామర్థ్యం ఇనుమడిస్తాయి.
అల్పాహారం మానేసినా, ఏదో కొద్దిగా తిన్నా మధ్యాహ్న భోజనం ఎక్కువగా లాగించే ప్రమాదముంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు బాగా పెరుగుతుంది. ఇది కొద్ది గంటల తర్వాత అలసటకు దారితీస్తుంది.
నీరు అత్యవసరం: మన శరీరం నీటి మీదే ఆధారపడి ఉంది. గ్లాసు నీళ్లు తాగితే అలసట తగ్గినట్టు అనిపించటమే కాదు.. కణాలకు ఆక్సిజన్, పోషకాలు కూడా సరఫరా అవుతాయి. నీటితో రక్తపోటు, గుండె వేగం అదుపులో ఉంటాయి కూడా.
కాస్త విరామం: శరీరం తనకు అవసరమైన వాటి గురించి చెప్పటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. వీటిల్లో అలసట ఒకటి. పనిలోంచి కాసేపు విరామం తీసుకోవటం మంచిదని చెప్పటమూ దీని ఉద్దేశం కావొచ్చు. కొద్దిసేపు చేస్తున్న పని నుంచి ధ్యాస మళ్లిస్తే ఆ తర్వాత ఏకాగ్రత, చురుకుదనమూ పెరుగుతాయి.
పరదాలు తొలగాలి:కాంతి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. నిజానికి మన శరీరం నిద్ర, మెలకువల సంకేతాలను కాంతి నుంచే గ్రహిస్తుంది. పని చేస్తున్నప్పుడు అలసటగా అనిపిస్తే కిటికీల పరదాలు తొలగించి చూడండి. లోపల వెలుతురు బాగా ఉంటే హుషారు దానంతటదే వస్తుంది.