తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Tips for weight control: బరువును అదుపులో ఉంచుకోండిలా..! - బరువును అదుపులో ఉంచుకోవడమెలా

అందరి దృష్టి ఇప్పుడు బరువు, ఆకారాల మీదే. ప్రపంచంలో ఎక్కడైనా వీటి విషయంలో తృప్తి పడనివారే ఎక్కువ. సన్నగా ఉండేవారికి బరువు పెరగాలనే కోరిక. లావుగా ఉండేవారికి తగ్గాలనే ఆశ. అధిక బరువు శరీరాకృతినే కాదు, ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. మరి దీన్ని అదుపులో ఉంచుకోవటమెలా?

Tips for weight control
Tips for weight control

By

Published : Feb 2, 2022, 7:19 AM IST

Tips for weight control: ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. కొందరు సన్నగా ఉంటే, కొందరు లావుగా ఉంటారు. ఇది శరీర స్వభావాల మీద ఆధారపడి ఉంటుంది. బరువు, ఆకారాలను బట్టి మనుషులను స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. పొడవుగా, సన్నగా ఉండేవారు (ఎక్టోమార్ఫ్‌).. బలంగా, దృఢంగా ఉండేవారు (మీసోమార్ఫ్‌).. అధిక బరువు గలవారు (ఎండోమార్ఫ్‌). సన్నగా ఉండేవారిలో జీవక్రియల వేగం ఎక్కువ. వీరిలో కండర మోతాదుతో పాటు కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నా బరువు అంతగా పెరగరు. దృఢంగా ఉండేవారిలో కండరాల మోతాదు ఎక్కువ. వీరు త్వరగా బరువు పెరుగుతారు గానీ కాస్త ప్రయత్నిస్తే తేలికగానే అదుపులో ఉంచుకోవచ్చు. ఇక అధిక బరువు గలవారిలో కేలరీలు అంతగా ఖర్చుకావు. జీవక్రియల వేగమూ నెమ్మదిస్తుంది. ఏం తినాలన్నా భయమే. జీవితాంతం బరువు పెరగకుండా చూసుకోవటానికి ప్రయత్నించాల్సి వస్తుంది.

బొజ్జ వద్ద కొవ్వు

సాధారణంగా ఆడవాళ్ల కన్నా మగవాళ్లు కాస్త సన్నగా ఉంటారు. ఆడవారిలో వయసు పెరుగుతున్నకొద్దీ, నెలసరి నిలిచిపోయే సమయానికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంటుంది. దీనికి కొంతవరకు హార్మోన్లలో తలెత్తే మార్పులను కారణంగా చెప్పుకోవచ్చు. బొజ్జ మూలంగా శరీర ఆకారం యాపిల్‌ మాదిరిగా కనిపిస్తుంది. వయసు, జీవక్రియల వేగం నెమ్మదించటం, వ్యాయామం చేయకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తినటం, ఒత్తిడి, నిద్రలేమి వంటివన్నీ క్రమంగా ఇలాంటి స్థితికి తీసుకొస్తాయి. ఆడవారైనా, మగవారైనా.. ఇలాంటివారిలో కడుపులోని అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన కొవ్వు. అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటికి దారితీస్తుంది.

ఊబకాయ కొలమానాలు

అధిక బరువు, ఊబకాయాన్ని గుర్తించటానికి కొన్ని కొలమానాలు ఉపయోగపడతాయి. వీటిల్లో నడుము-తుంటి నిష్పత్తి (డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఒకటి. దీన్ని ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. తుంటి చుట్టుకొలతను నడుము చుట్టుకొలతతో భాగిస్తే వీటి నిష్పత్తి తెలుస్తుంది. మహిళల్లో ఇది 0.85, అంతకన్నా తక్కువగా.. పురుషుల్లో 0.9 కన్నా తక్కువగా ఉండాలి. మరో కొలమానం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ). ఎత్తును ఎత్తుతో గుణించి (మీటర్లలో).. బరువుతో (కేజీల్లో) భాగించి దీన్ని లెక్కిస్తారు. ఇది 30 కన్నా పెరిగితే ఊబకాయం ఉన్నట్టే. సాధారణంగా యాపిల్‌ ఆకారం శరీరం గలవారిలో బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం.

సమస్యలు రకరకాలు

ఊబకాయంతో మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటివే కాదు.. ఇతరత్రా సమస్యలూ పొంచి ఉంటాయి. నడుము-తుంటి నిష్పత్తి 0.8 కన్నా ఎక్కువగా గల మహిళల్లో సంతాన సామర్థ్యమూ తగ్గుతుంది. చాలామందికి చికిత్సలు తీసుకుంటే తప్ప సంతానం కలగకపోవటం గమనార్హం. ఇక పురుషుల విషయానికి వస్తే నడుము-తుంటి నిష్పత్తి 0.9 కన్నా తక్కువగా ఉన్నవారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ. వీరికి వృషణాల క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశమూ తక్కువే. ఈ నిష్పత్తి ఎక్కువగా గల వృద్ధులకు మరణించే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టూ కొన్ని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి.

మారే మార్గముంది

నడుము-తుంటి నిష్పత్తి, బీఎంఐ ఎక్కువగా ఉన్నా కొన్ని జాగ్రత్తలతో తగ్గించుకునే అవకాశం లేకపోలేదు.

  • రోజూ నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి ఏరోబిక్‌.. అంటే గుండె, శ్వాస వేగాలను పెంచే వ్యాయామాలు చేయటం మంచిది. వీటిని ఎంతసేపు చేయాలన్నది ఆయా వ్యక్తుల బరువును బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రోజుకు అరగంట సేపైనా చేయటం మంచిది.
  • కండర మోతాదు పెరిగితే కొవ్వు తగ్గుతుంది. అందువల్ల కండరాలను పెంచే వ్యాయామాలూ చేయాలి. వారానికి మూడు నాలుగు రోజుల పాటు సుమారు 20 నిమిషాల సేపు డంబెల్స్‌ ఎత్తటం, దించటం మేలు చేస్తుంది. చాలామందికి 2.5 కిలోల బరువుగల డంబెల్స్‌ సరిపోతాయి. వీటిని ఎత్తటం, దించటం క్రమంగా పెంచుకుంటూ రావాలి. మధ్యలో మానెయ్యొద్దు.
  • ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పిండి పదార్థాలు మరీ ఎక్కువగా తినకుండా చూసుకోవాలి.
  • రోజూ 12 గంటల సేపు ఉపవాసం చేయటమూ మేలే. ఇది కష్టంగా అనిపించినా రాత్రి భోజనాన్ని పడుకోవటానికి గంట ముందే ముగిస్తే తేలికగానే పాటించొచ్చు. ఉదాహరణకు- రాత్రి భోజనాన్ని 8 గంటలకు చేస్తే తెల్లారి 8 గంటల తర్వాతే అల్పాహారం తినాలి. దీంతో 12 గంటలు ఉపవాసం చేసినట్టు అవుతుంది. మధుమేహం గలవారు దీన్ని డాక్టర్‌ సలహా మేరకే పాటించాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:Adequate Sleep: మీకు నిద్ర సరిపోతోందా.. లేదా.. తెలుసుకోండిలా!!

ABOUT THE AUTHOR

...view details